ఒకే రజనీ, ఒకే చిరు, ఒకే బాలయ్య..... ‘కాలా’ హైదరాబాద్ వేడుకలో రజనీ స్పీచ్ అదుర్స్
Recommended Video

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'కాలా' జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రజనీకాంత్, ధనుష్, హుమా ఖురేషి, ఈశ్వరి, దర్శకుడు పా రంజిత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రసంగం ఆకట్టుకుంది.

తెలుగులో అవకాశాలున్నా తమిళంలో కంటిన్యూ అయ్యాను
1978లో నా తొలి తెలుగు సినిమా ‘అంతు లేని కథ' విడుదలైంది. దాని తర్వాత పది నుండి 20 చిత్రాలు తెలుగులో చేశాను. అటు తమిళంలో చేస్తూ తెలుగు సినిమాలు కూడా చేయడంతో రెండు ప్రాంతాల్లో మంచి పేరు వచ్చింది. తమిళ సినిమాలపై కాన్సట్రేట్ చేయాలా? తెలుగు సినిమాలపై కాన్సట్రేట్ చేయాలా? అనే పెద్ద అయోమయం ఉండేది. బాలచందర్ గారి వల్ల తమిళంలో నా కెరీర్ మొదలైంది కాబట్టి తమిళంలో నా కెరీర్ కంటిన్యూ అయింది... అని రజనీకాంత్ తెలిపారు.

అది నాకు దక్కిన భాగ్యం
నా కెరీర్ మొదటి నుండి తమిళ ప్రేక్షకులు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. అది నాకు దక్కిన భాగ్యంగా భావిస్తాను. తెలుగులో కొంత గ్యాప్ తర్వాత మోహన్ బాబు తను తీస్తున్న పెదరాయుడు సినిమాలో నన్ను తీసుకున్నారు. దాని తర్వాత భాషా, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ అలా వరుసగా నా సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి.... అని రజనీ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్, దాసరిని గుర్తు చేసుకున్న రజనీ
ఆరోజుల్లో హైదరాబాద్ వచ్చినపుడు పెద్దాయన ఎన్టీఆర్ గారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునే వాడిని. ఇప్పటికీ హైదరాబాద్ వచ్చినపుడల్లా ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. బాలచందర్ గారి తర్వాత నాకు ఇంకో గరువుగారు దాసరి నారాయణరావు. నన్ను ఒక సొంత బిడ్డలాగా ప్రేమించారు. ఆయన మన మధ్య లేక పోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... అని రజనీ తెలిపారు.

ఎవరికీ వారే ప్రత్యేకం
ధనుష్ చెప్పినట్లు ఒకే రజనీకాంత్... ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ ఉంటారు. ఎవరికి వారు ప్రత్యేకం. ఎవరూ ఎవరికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. కేవలం అవకాశాలు అందిపుచ్చుకోవడంలోనే తేడా ఉంటుంది. మనకు వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సక్సెస్ అయితే దేవుడు మీద నమ్మకం లేనివారు లక్ అంటారు. దేవుడిని నమ్మేవారు పైవాడి ఆశీర్వాదం అంటారు. ఏ ఫీల్డ్ అయినా ఆ అవకాశం అనేది దొరికితే... దాన్ని వదులుకోకుండా కష్టపడి పని చేస్తే తప్పకుండా ఫలితం దొరుకుతుంది.... అని రజనీకాంత్ తెలిపారు.

అదే దర్శకుడు రంజిత్ స్టైల్
రంజిత్‌తో కబాలి సినిమా చేసినపుడు రజనీకాంత్ ఏమిటి ఈ చిన్న వ్యక్తి, కొత్త వ్యక్తిని అవకాశం ఇచ్చారేమిటి అన్నారు. కానీ నాకు రంజిత్ స్టోరీ నేరేట్ చేసినపుడే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ‘కబాలి' ఎంత బాగా ఆడిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత రంజిత్ తో మరో సినిమా చేయాలనుకున్నాను. ఈ ‘కాలా' చిత్రాన్ని నా అల్లుడు ధనుష్ నిర్మించారు. మా సినిమా గురించి మేము గొప్పగా చెప్పుకోవడం బావుండదు. కాలా రెండు సార్లు చూశాను. కమర్షియల్‌గా కాకుండా ఒక మంచి మెసేజ్ ఉన్న చిత్రం. సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ మిక్స్ చేసి రియాల్టీగా సినిమా తీయడం రంజిత్ స్టైల్... అని రజనీకాంత్ తెలిపారు.
ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా
ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ముంబై ధారావి. అందులో ఉండే మనుషులు, వారి జీవితాల ఎలా ఉంటాయి అనే అంశంపై ‘కాలా' సినిమా ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో హీరో క్యారెక్టర్ కే ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ‘కాలా' సినిమాలో చాలా పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లు గుర్తుండి పోతాయి. అలాంటి క్యారెక్టర్స్ రంజిత్ క్రియేట్ చేశారు. ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. స్లమ్ పీపుల్ జీవితం ఎలా ఉంటుంది అనేది సినిమాలో బాగా చూపించారు. ఆయన యూనిట్ తో చాలా ఫ్రెండ్లీగా పని చేస్తారు. సంతోష్ నారాయణ్ మంచి క్లాస్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. నానా పాటేకర్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నారు. కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేస్తున్న రెండవ సినిమా ఇది. తొలి మూవీ సంచలన విజయం సాధించడంతో ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన లైకా ప్రొడక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతోంది.


Click it and Unblock the Notifications











