సోనియా గాంధీ కోరితే మా సినిమా చూపుతాం
యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరితే ప్రత్యేకంగా తాము రూపొందించిన చిత్రాన్ని చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని దర్శకుడు ప్రకాశ్ ఝా ప్రకటించారు. అలాగే ఆమె జీవిత విశేషాల ఆధారంగా రాజ్‌నీతి సినిమాను రూపొందించలేదని ప్రకాశ్ ఝా శనివారం స్పష్టం చేశారు. సోనియా గాంధీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజేతగా నిలిచారని..ఆమె గాథ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఒక ప్రత్యేక సినిమా తీస్తే తప్ప ఆమె జీవితాన్ని తెరకెక్కించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్ నీతిలో కత్రినా కైఫ్ పాత్రకు..సోనియా జీవితానికి ఎలాంటి పోలికలూ ఉండవని ఝా అన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలను ఎలా ఉపయోగించుకుంటున్నారో వివరించే కమర్షియల్ సినిమా ఇదని అభివర్ణించారు.
పాలనపరమైన రాజకీయాలే కాకుండా మన జీవిత రాజకీయాల గురించి రాజ్‌నీతి చర్చిస్తుందన్నారు. వ్యక్తిగత జీవితాల్లో ఉండే అంకితభావం, మోసం, దగాలను చూపిస్తుంద ని చెప్పారు. వచ్చే నెల నాలుగున విడుదలయ్యే ఈ సినిమా కోసం ప్రకాశ్ ఝా పలు నగరాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఢిల్లీ సహా ఏడు నగరాల్లో తిరుగుతూ కాలేజీ క్యాంపస్‌లలోని విద్యార్థులను కలుసుకొని యువజన, రాజకీయాలపై చర్చిస్తామన్నారు. నిర్బంధ ఓటింగ్, రిజర్వేషన్ల గురించి కూడా చర్చ నిర్వహిస్తామన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా ప్రకాశ్ ఝా చిత్ర నటీనటులతో జాతీయ గీతాన్ని చిత్రీకరించారు. సినిమా సందర్భంగా ప్రదర్శించడానికి దీనిని థియేటర్ల యజమానులకు అందజేస్తామని ప్రకాశ్ ఝా వివరించారు.


Click it and Unblock the Notifications











