మరో వివాదంలో వర్మ రక్తచరిత్ర, ఆనందపురంపై అభ్యంతరం
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర మరో వివాదంలో చిక్కుకుంది. వివాదాన్ని తొలగించుకోవడానికి సినిమాలోని అనంతపురం పేరును ఆనందపురంగా మార్చారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం గ్రామవాసులు ఆ పేరుకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఆనందపురం పేరును తొలగించకపోతే ఉత్తరాంధ్రలో సినిమాను ఆడనివ్వబోమని వారు హెచ్చరిస్తున్నారు. మండల కేంద్రమైన ఆనందపురం కూరగాయలకు, పూలకు, పండ్లకు పెట్టింది పేరు. సస్యశ్యామలమైన ప్రాంతం, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఊరి పేరును కక్షలకు, కార్పణ్యాలకు, హత్యలకు, దాడులకు, ఫాక్షన్ తగాదాలకు చోటు కల్పిస్తూ తీసిన రక్తచరిత్రలో పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆ పేరును తొలగించడానికి రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు, అప్పుడు కూడా తొలగించకపోతే ప్రత్యక్ష చర్యకు దిగుతామని గ్రామస్థులు చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని వారు చెప్పారు. వర్మకు తమ ఊరి పేరు పెట్టాలనే ఆలోచన రావడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











