రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర శ్రీరాములయ్యకు కౌంటర్?
రామ్ గోపాల్ వర్మ శ్రీరాములయ్య చిత్రానికి కౌంటర్ గా భావిస్తున్నారు. రక్త చరిత్ర సినిమా విడుదలయ్యే వరకు ఈ కోణం వెలుగులోకి రాలేదు. సినిమా విడుదలైన తర్వాత ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రీరాములయ్య చిత్రాన్ని పరిటాల రవి నిర్మించారు. అది పరిటాల రవి ఆత్మకథ. అందులో పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య పేదల పక్షాన నిలబడి, దొరల పెత్తనాన్ని ఎదుర్కున్న తీరును చిత్రించారు. ఆ క్రమంలో శ్రీరాములయ్య నక్సలైట్ గా మారడం కూడా ఉంటుంది. పరిటాల రవి సోదరుడు పరిటాల హరి కూడా ఫాక్షనిజంలో హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థుల హత్యలు కూడా జరిగాయి. వాటిలో టీవీ బాంబు సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. శ్రీరాములయ్య చిత్రంలో హరికృష్ణ పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్యను నక్సలిజం వైపుకు మళ్లించిన నాయకుడిగా కనిపిస్తాడు. మోహన్ బాబు శ్రీరాములయ్యగా నటించారు. చిత్రానికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జూబ్లీహిల్స్ లో బాంబు దాడి కూడా జరిగింది.
కాగా, పరిటాల రవి తండ్రిని ఉదాత్తంగా తీర్చిదిద్డడం సహించలేని మద్దెల చెర్వు సూరి రక్త చరిత్ర నిర్మాణం వెనక ప్రధాన పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది. మద్దెలచెర్వు సూరిని కూడా రక్తచరిత్రలో ఉదాత్తంగా చిత్రించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. రక్తచరిత్రలో పరిటాల రవిని రౌడీగా, ఆయనను రాజకీయాల్లో ప్రోత్సహించిన స్వర్గీయ ఎన్టీ రామారావును విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రౌడీని రౌడీతోనే చిత్తు చేయాలనే ఉద్దేశం ఎన్టీఆర్ కు ఉండడం వల్లనే పరిటాల రవిని ప్రోత్సహించారనే అభిప్రాయం కలిగేలా రక్తచరిత్ర చిత్రంలోని సంఘటనలున్నాయి.


Click it and Unblock the Notifications











