Chiranjeevi45 .. టాలీవుడ్‌లో 45 ఏళ్ల మెగాస్టార్.. చరణ్, సాయి తేజ్ ఎమోషనల్ ట్వీట్స్
మెగాస్టార్ చిరంజీవి అనేది తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతింతై వటుడింతైనట్లు ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తూ తన అలుపెరుగని ప్రయాణాన్ని ఈరోజుకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. చిరంజీవి చిత్ర సీమలోకి ప్రవేశించి సెప్టెంబర్ 22కి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్, రామ్ చరణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అభినందనలు తెలియజేశారు.
ముందుగా రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు, ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు,

వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నగారికి ధన్యవాదాలు'' అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
మరోపక్క సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ మెగా ప్రస్థానానికి 45 ఏళ్లు, చరిత్రకు ఏమాత్రం తగ్గని ప్రయాణం, ఎక్కడి నుంచో సినిమా ఆకాశానికి ఎదిగారు. మీ ఎదుగుదల మాలో చాలా మందికి స్ఫూర్తి, టార్చ్ బేరింగ్ అని అంటూ రాసుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో పెదమామా చిరంజీవి గారికి అభినందనలు & మాలో బలమైన విలువలు, క్రమశిక్షణ & సినిమా పట్ల ప్రేమను పెంచినందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు' విడుదలైంది.
అయితే ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని చిరు చెబుతూ ఉంటారు. నిజానికి చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ కాగా సినీరంగానికి వచ్చాక ఆయన చిరంజీవిగా మారారు. అలా కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారి సెప్టెంబర్ 22వ తేదీతో 45 ఏళ్లు పూర్తయింది.
చిరంజీవి అంగీకరించి, మొదలుపెట్టిన తొలి సినిమా పునాదిరాళ్లు అయినా కానీ ఆయన కెరీర్ లో విడుదలైన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబర్ 22న విడుదలైంన ఈ సినిమాతోనే ఆయన తన నట జీవితాన్ని లెక్కిస్తున్నారు. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాలరావు, చంద్రమోహన్, చిరంజీవి, రేష్మా రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. సినిమాలో పల్లెటూరి యువకుడిగా చిరంజీవి కనిపించారు.


Click it and Unblock the Notifications











