ఎలా చేద్దాం: ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ చర్చలు!(ఫోటో)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం షూటింగ్ సందర్భంగా విజయవాడ నుంచి వచ్చిన అభిమానులను కలిసారు. ఈ సందర్భంగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డే(మార్చి 27) వేడుకల ప్రస్థావన తెచ్చారు. ఆ సందర్భంగా చేసే కార్యక్రమాలను చెర్రీకి వివరించారు. క్రింది ఫోటోలో అందుకు సంబంధించిన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
అదే విధంగా 'నాయక్' సినిమా ఫీడ్ బ్యాక్ గురించి కూడా అభిమానులను అడిగి తెలుసుకున్నారు. సినిమా విడుదల సందర్భంగా అభిమానులకు ఏమైనా సమస్యలు ఏర్పాడుతున్నాయా? డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానుల సహకారం ఎలా ఉంటోందనే విషయాలను ఆరా తీసారు.
రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్. విడుదల చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'ఎవడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











