'ఈగ'ట్రైలర్ పై రామ్ చరణ్ కామెంట్
రాజమౌళి తాజా చిత్రం ఈగ ట్రైలర్ రీసెంట్ గా ఆడియోతో పాటు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్ ని చూసిన రామ్ చరణ్ తేజ తనదైన శైలిలో ట్విట్టర్ లో ...ఇప్పుడే ఈగ మూవి ట్రైలర్ చూసాను. సూపర్బ్ గా ఉంది. హ్యాట్సాఫ్ టు రాజమౌళి అండ్ టీమ్. ఐ గెస్ ఇటీజ్ టైమ్ నౌ టుబి నైస్ టు ది ఈగాస్ ఎరౌండ్ అజ్. ఇఫ్ నాట్..అంటూ ట్వీట్ చేసారు. రాజమౌళి దర్శకత్వంలో గతంలో మగధీర చిత్రంలో చేసిన రామ్ చరణ్ మొన్న ఆడియో పంక్షన్ కి హాజరు కాలేదు. ఇక మొన్న శనివారం విడుదలైన ఈగ ఆడియో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఈ చిత్రం కథ గురించి రాజమౌళి చెపుతూ...అనగనగా ఓ ఈగ. ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయింది. ఎంత తలచుకొన్నా గుర్తుకు రాలేదు. అందర్నీ అడిగింది. అందరూ వెకిలిగా ఓ నవ్వు నవ్వినవారే. చివరికి చీమ 'ఈ..ఈ..' అంటూ ఓ హింటు ఇచ్చింది. అప్పుడు 'నా పేరు ఈగ కదూ..' అని తెలుసుకొంటుంది. ఒకటో తరగతిలో చదువుకొన్న సరదా కథ ఇది. అయితే ఇక్కడ ఇంకో ఈగ ఉంది. తనకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏదీ తేలిగ్గా మర్చిపోయే రకం కాదు. అందుకే గత జన్మలో పగ కూడా గుర్తుకు తెచ్చుకొంది. మరి ప్రతీకారం ఎలా తీర్చుకొందో తెలియాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే అన్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతూండటంతో సినిమా బాగా లేటవుతోంది. అయితే అవుట్ పుట్ బాగా వచ్చినట్లు, బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతున్నట్లు ట్రేడ్ సమాచారం.
అలాగే''బలవంతుడైన మనిషికీ, అల్పప్రాణి ఈగకూ మధ్య జరిగిన పోరాటం ఇది. నాని, సమంత, సుదీప్ ముగ్గురూ ఈ కథని బాగా అర్థం చేసుకొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కళ: రవీందర్, సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











