నోవాటెల్ లో రామ్ చరణ్ పెళ్ళి రిసెప్షన్
ఈ రోజు (గురువారం)సాయంత్రం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో రామ్ చరణ్ పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు వేల మందికి ఆహ్వానాలు అందజేశారు. ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించిన వారికి మించి ఇతరులు రాకుండా ఆహ్వానపత్రికలోనే ఒక స్వైప్ కార్డు పంపిణీ చేశారు. ఆ కార్డులున్న వారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ లో ఘనంగా జరిగింది.
ఇక ఈ పెళ్లి సందర్భంగా చిరంజీవి కుటుంబ సినీ అభిమానులకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగబాబు ఈ విందు విషయమై మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, తిరుపతి నుంచి వచ్చిన పలువురు అభిమానులు ముత్యాల తలంబ్రాలు, పెళ్లి బట్టలు తీసుకువచ్చి నాగేంద్రబాబుకు అందజేశారు.
పెళ్లి కార్యక్రమాన్ని అన్ని వార్తా చానళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ప్రసారమయ్యే వీలుగా ఉదయం ఏడు గంటల నుంచి పెళ్లి మండపంలోని కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారంగా ఆయా చానళ్ల ప్రతినిధులకు అందజేసారు. అయితే మీడియాని మాత్రం లోపలకి ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం బయిటనుంచే వారిని కవర్ చేయనిచ్చారు.
పెళ్లి మండపం, పరిసరాలను సినీ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్‌సాయి అత్యంత ఖరీదైన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు, వధువు కుటుంబ బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులలో అనేక మంది ఈ వివాహ వేదికలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు అందజేసారు. మరో ప్రక్క రాంచరణ్‌తేజ-ఉపాసనల పెళ్లికి మెగా అభిమానులు ఎవరూ రావద్దని నాగేంద్రబాబు విజ్ఞప్తి చేయటంలో వారెవ్వరూ రాలేదు. అభిమానులంతా టీవి ముందు కూర్చుని తిలకించారు.


Click it and Unblock the Notifications











