కేకపెట్టిస్తున్న రామ్ చరణ్ 'నాయక్' (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'నాయక్' చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. అతి త్వరలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌ని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం స్టిల్స్ ని మీడియాకు విడుదల చేసారు. అవి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉన్నాయి. వాటిని ఓ లుక్కేద్దామా...
రామ్ చరణ్ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. గ్యారెంటీగా సంక్రాంతి విన్నర్ ఇందే అంటున్నారు. ఎందుకంటే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు వివి వినాయిక్. యాక్షన్ ని ఎంటర్టైన్మెంట్ ని సమపాళ్లలో రంగరించగలగటం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అదే స్టైల్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

''నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. చరణ్ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది. చరణ్ నృత్యాలు, అతనిపై చిత్రీకరించిన ఫైట్స్ మాస్‌ని అలరిస్తాయి. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్ మంచి బాణీలను అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు వివి వినాయిక్ చెప్పారు.

రామ్ చరణ్ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.

జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే.

''సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్ శైలిలో మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.

వినాయక్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రారంభంలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందరి అంచనాలు అందుకొనేలా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుంది. వినాయక్ టేకింగ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ... "నాయకు క్లైమాక్స్ సాంగ్ పూర్తైంది... సూపర్ హ్యాపీగా ఉంది. నాయక్ ఆడియో డిసెంబర్ లో... నాయక్ లో నాలుగు పాటలు చూసాను.. పెంటాస్టిక్ విజువల్స్,కొరియాగ్రఫీతో సూపర్బ్ గా ఉన్నాయి. డెఫినట్ గా చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ అవుతుంది" అంటున్నారు.

ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని దర్శకుడు వినాయక్ అన్నారు.

కాజల్, అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, ఫొటోగ్రఫీ: చోటా కె.నాయుడు, సంగీతం: థమన్ ఎస్., ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనందసాయి, ఫైట్స్: కణల్ కన్నన్, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.


Click it and Unblock the Notifications











