'నాయక్' వివాదం... వినాయిక్ దిష్టిబొమ్మ దగ్దం
తిరుపతి: రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'నాయక్' చిత్రం వివాదం కొనసాగుతోంది. చిత్రం పేరును గిరిజన విద్యార్ధి సమాఖ్య వ్యతిరేకిస్తోంది. ఎస్‌వి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద సమాఖ్య కార్యకర్తలు ధర్నా చేశారు. చిత్ర దర్శకుడు వివి వినాయక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాఖ్య అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ టైటిల్ ఎంపికపై నిర్మాతలను తప్పుపట్టారు. ఇందులో గిరిజన జీవన విధానం కాని చరిత్ర కాని ప్రతిబింబించలేదన్నారు. ఈ కాలంలో పలు తెలుగు చిత్రాలు సెక్స్‌కు, ముఠా తగాదాలకు, నేరప్రవృత్తి కథాంశాలతో కూడిన స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. టైటిల్ మార్చకపోతే చిత్ర ప్రదర్శన అడ్డుకుంటామని హెచ్చరించారు. సెన్సార్ బోర్డుకు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
మరో ప్రక్క ఈ సినిమాకు 'నాయక్' అనే టైటిల్ పెట్టడాన్ని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం నేతలు తమ అభ్యంతరం వ్యక్తం చేసారు. గిరిజన ఆత్మగౌరవానికి సంబంధించిన 'నాయక్' అనే పదాన్ని వాడరాదని, ఈ పదం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని సినిమా వ్యాపారం కోసం వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, వెంటనే 'నాయక్' టైటిల్ ను మార్చాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











