రామ్ చరణ్ స్పెషల్ పెళ్లి విందు డిల్లీలో....
రామ్ చరణ్,ఉపాసన వివాహం ఘనంగా నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అలాగే వివాహ రిసెప్షన్ నిన్న సాయింత్రం హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసారు. దానితో పాటు...కాంగ్రెస్ అధిష్టాన పెద్దల కోసం చిరంజీవి ఢిల్లీలో ప్రత్యేక విందును ఏర్పాటు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ కూడా జరిగినట్లు తెలిసింది. ఈ వారంలోనే ఓ రోజు ఆ విందు ఉండబోతోందని సమాచారం. ఏ రోజు అనేది తెలియరాలేదు.
అలాగే తన కుమారుడు వివాహ వేడుకల్లో భాగంగా మెగాస్టార్ తన 'మెగా'భిమానులకు ఈ రోజు విందు ఇస్తున్నారు. వివాహం జరిగిన వ్యవసాయ క్షేత్రంలోనే శుక్రవారం విందు ఏర్పాట్లు చేశారు. కొత్త దంపతులతో పాటు, మెగాస్టార్ కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి విందు జరగనున్నది. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ వేడుక కోసం అభిమానులకు పాసులు జారీ చేశారు. ఆ పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సుమారు 5 వేల మంది ఈ విందుకు వస్తారని అంచనా.
నాగబాబు ఈ విందు విషయమై మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, తిరుపతి నుంచి వచ్చిన పలువురు అభిమానులు ముత్యాల తలంబ్రాలు, పెళ్లి బట్టలు తీసుకువచ్చి నాగేంద్రబాబుకు అందజేశారు.
ఇక గురువారం రాత్రి హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రామ్ చరణ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. రిసెస్షన్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు నాగార్జున దంపతులు, మహేష్‌బాబు దంపతులు, ప్రభాస్, పూరి జగన్నాథ్ దంపతులు, జయప్రద, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











