షాకింగ్: దాడికేసులో ఇరుక్కుపోయిన రామ్ చరణ్?
దాడిపై న్యాయవాది సయ్యద్ సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలన్న కమిషన్ ఆదేశాల మేరకు బంజారాహిల్స్ ఏసీపీ నివేదిక సమర్పించారు. గొడవ జరిగినప్పుడు రాంచరణ్ అక్కడే ఉన్నారని, కొద్దిసేపటి తరువాతే వెళ్లిపోయారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు న్యాయవాది సలీం మంగళవారం హక్కుల కమిషన్ విచారణ సందర్భంగా ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి చిరంజీవి కోసం నియమించిన నగర భద్రత విభాగం పోలీసులు ఆయన తనయుడు రాంచరణ్‌తో పాటు ఉన్నారని ఏసీపీ నివేదికలో పేర్కొన్నారన్నారు. తాము హక్కుల కమిషన్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అభియోగాలపై ఏసీపీ చాలా వాటికి సమాధానం ఇచ్చారని, కేసు నమోదు విషయంలో మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వలేదని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై జీడీ ఎంట్రీ క్రమ సంఖ్య 15 (279వ పేజీలో)లో నమోదు చేశారని ఏసీపీ నివేదికలో పేర్కొన్నట్లు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి చిరంజీవి కోసం నియమించిన భద్రతా సిబ్బందిని ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే ఆ సమయంలో మంత్రికి ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని న్యాయవాది ప్రశ్నించారు.
తమపై రాంచరణ్ దాడి చేశాడంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు వెంటనే వారిని వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి పంపించాల్సింది పోయి, ఇరువర్గాలు రాజీ పడ్డాయంటూ బంజారాహిల్స్ పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఏసీపీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ హక్కుల కమిషన్ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి తదుపరి విచారణను ఆగస్టు 26కి వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications












