దుర్గమ్మ పాదాల చెంత చెర్రీ లగ్న పత్రిక
సినీ హీరో రామ్ చరణ్ తేజ లగ్నపత్రికను గురువారం బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన కుమారుడు రామ్ చరణ్ తేజ లగ్న పత్రికను తీసుకుని ఇంద్ర కీలాద్రికి చేరుకున్నారు. ఆమెకు దేవస్థానం ఇవో రఘునాథ్ స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకుని వెళ్లారు.
దుర్గమ్మ పాదాల చెంత లగ్న పత్రికను ఉంచి సురేఖ పూజలు చేశారు. అ తర్వాత ఆమె తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఉపాసన కామినేనితో రామ్ చరణ్ తేజ వివాహం జూన్ 14వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. వివాహానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లిని గ్రాండ్ చేయడానికి ఇరువురి కుటుంబాలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి.
వివాహ వేదికను కనీవినీ ఎరుగని రీతిలో రూపొందిస్తున్నారు. ఉపాసన ఫామ్‌హౌస్‌లో వేదికను రూపు దిద్దాలని చిరంజీవి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి సూచించారు. రిసెప్షన్ వేదికకు హంగులు అద్దుతున్నారు. పెళ్లికి చలన చిత్ర ప్రముఖులను, రాజకీయ నాయకులను, బడా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనయా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా వివాహానికి రావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.


Click it and Unblock the Notifications











