ఉపాసన-రామ్ చరణ్‌ల వివాహ విశేషాలు
రామ్ చరణ్, ఉపాసనల వివాహం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గతంలో నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగింది. రామ్ చరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణి కపూర్, అంబరీష్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీ మోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు.
రాష్టగ్రవర్నర్ నరసింహన్ దంపతులు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం కిరణ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, రఘువీరా రెడ్డి, జానారెడ్డి వివాహ వేడుకలకు హాజరయారు.
వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్ కళ్యాణ్, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. పెళ్లికి రెండుమూడ్రోజుల ముందు నుంచే రోజుకో కార్యక్రమాన్ని చేపట్టిన వధూవరుల కుటుంబాలు ... పెళ్లిని కూడా కనివినీ ఎరగని రీతిలో జరిపించాయి. వివాహ వేడుక ఇంకా కొనసాగుతోంది. పెళ్లి మండపం వద్ద టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినీ తారల సందడి కనిపిస్తోంది.
పెళ్లి మండపం, పరిసరాలను సినీ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్‌సాయి అత్యంత ఖరీదైన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు, వధువు కుటుంబ బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులలో మూడు వేల మందికి మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానాలు అందజేశారు. పెళ్లి సందర్భంగా చిరంజీవి కుటుంబ సినీ అభిమానులకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పెళ్లి కార్యక్రమాన్ని అన్ని వార్తా చానళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ప్రసారమయ్యే వీలుగా ఉదయం ఏడు గంటల నుంచి పెళ్లి మండపంలోని కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారంగా ఆయా చానళ్ల ప్రతినిధులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ అత్తమామలు రూ.రెండుకోట్లు ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును అల్లుడికి బహూకరించారు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుండే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











