దటీజ్ రాంచరణ్, ఉపాసన.. 500 కుటుంబాల కోసం.. జానీ మాస్టర్ ఎమోషనల్ ట్వీట్
ఇండియాలో నెంబర్ వన్ కోరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకొన్న జానీ మాస్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల పుట్టిన రోజును జరుపుకొన్న ఆయన తాను అధ్యక్షుడిగా ఉండే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్స్ కోసం విశేష సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తన కొరియోగ్రాఫర్స్ సంస్థలోని సభ్యులకు ఇన్సూరెన్స్ అందించాలని కోరిన వెంటనే రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల స్పందించడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ..
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ అన్నయ్య ఇంటికి పిలిచారు. వారు నాపై ఉన్న ప్రేమను తెలుసుకొని చాలా సంతోషపడ్డాను. వారికి ఇంటికి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతోపాటు చరణ్ అన్నయ్య, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకు నాలో సంతోషం 1000 రెట్లు పెరిగింది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతంలో నేను అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మా డ్యాన్సర్ యూనియన్ TFTTDA లోని 500 కుటుంబాలకు ఆరోగ్య భీమాను అందేలా హామీ ఇచ్చారు. యూనియన్ సభ్యులకు అండగా నిలబడతామని మనస్పూర్తిగా వెల్లడించారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని, ఇచ్చిన మాటకు విలువనిచ్చారు. అలాగే అన్ని కుటుంబాలను చేరదీయడం సాధారణమైన విషయం కాదు.అందుకు మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది అని జానీ మాస్టర్ ఉద్వేగానికి గురయ్యారు.
మా యూనియన్ సభ్యులకు అండగా నిలిచినందుకు మా అందరి తరఫున రాంచరణ్, ఉపాసన అన్నావదినలకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ సహాయం ఎప్పుడూ మరిచిపోలేనిది అని జానీ మాస్టర్ అన్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా, అతిసాధారణమైన స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి ఎదిగిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సూపర్ స్టార్స్, స్టార్ హీరోల పాటలకు నృత్యాలు సమకూర్చారు. చిరంజీవి, రాంచరణ్, మహేష్, విజయ్, రజనీకాంత్ లాంటి హీరోలకు ఇటీవల జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











