మహేష్ నుంచి ఫోన్ వచ్చింది: రామ్ చరణ్
హైదరాబాద్ : మహేష్ బాబుకి,తనకూ మంచి రిలేషన్ ఉందని చెప్తున్నారు రామ్ చరణ్ . ఆయన మాట్లాడుతూ... మహేష్‌బాబు నాతో సరదాగానే ఉంటాడు. 'మగధీర' సమయంలో మహేష్ ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్పారు అన్నారు. మార్చి 27న రామ్‌చరణ్ జన్మదినం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే సినిమాల్లోకి వచ్చిన తరవాత నాపై నాకు విశ్వాసం మరింత పెరిగింది. మొండితనం అనేది చిన్నప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక నటుడిగా అంటారా.. సినిమాకీ సినిమాకీ ఎంతో కొంత మార్పు కనిపిస్తోంది. 'చిరుత' నుంచి 'నాయక్' వరకూ... నటుడిగా, వ్యక్తిగా ఎదుగుతున్నను. నాన్నగారు ఎప్పుడూ ఆయన అభిప్రాయాలు నాపై రుద్దలేదు. ఎవరికి వాళ్లు తయారవ్వాలి.. అనేది ఆయన అభిప్రాయం. నేను కూడా అదే దారిలో వెళ్తున్నా. నాకు నేనుగా నేర్చుకొంటున్నా. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
'నాయక్' హిట్ గురించి మాట్లాడుతూ... 'నాయక్' నా కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రం. తొలిసారి ద్విపాత్రాభినయం చేశా. వినాయక్‌పై నేను పెట్టుకొన్న నమ్మకం.. 'నాయక్'. నేను ఆయన్ని ఎంత నమ్మానో, నన్ను ఆయన అంతే నమ్మారు. మా నమ్మకాలు నిజమయ్యాయి. తొలిసారి ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేశా అని వివరించారు. చిరంజీవి 150వ సినిమా గురించి చెప్తూ... తప్పకుండా ఉంటుంది. కానీ అదెప్పుడో నాన్నగారే చెప్పాలి. ఆయన కోసం నేను కూడా కథలు వింటున్నా. ఇప్పటికి నాలుగు కథలు సిద్ధమయ్యాయి. ఇంకా వింటూనే ఉన్నా. డాడీ పచ్చజెండా వూపడమే తరువాయి అన్నారు.
తన తాజా చిత్రాలు...'ఎవడు', 'తుఫాన్' సినిమాలు గురించి చెప్తూ... 'ఎవడు' పక్కా కమర్షియల్ సినిమా. అయితే కొత్త పంథాలో ఉంటుంది. ఓ పాట, ఓ ఫైటు అనే సూత్రం ప్రకారం సాగదు. సినిమా ఎత్తుగడే.. విభిన్నంగా ఉంటుంది. హీరో రావడంతోనే ఫైటో, పాటో అనే విధానం కనిపించదు. ఇదో థ్రిల్లర్. ఇక 'తుఫాన్'.. నేపథ్యమే వేరు. అది సంపూర్ణ విందు భోజనంలా ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











