కూతురు వివాహ జీవితంపై వర్మ సంచలన వ్యాఖ్యలు (ఇంటర్వ్యూ)
హైదరాబాద్: సాధారణంగా ఏ తండ్రయినా తన కూతురు జీవితం ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా సాగి పోవాలని కోరుకుంటాడు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు భిన్నంగా కోరుకుంటున్నాడు. తన తాజా సినిమా ‘365 డేస్' సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా వర్మ ఓ ప్రశ్నకు స్పందిస్తూ.....నా దృష్టిలో వాళ్లు(కూతురు-అల్లుడు) బోరింగ్ కపుల్. ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా వుంటారు. అందుకే వాళ్లను చూస్తే బోర్ అనిపిస్తుంది. నాకు గొడవలు పడే భార్యభర్తలంటేనే ఇష్టం. అలాంటివారుంటేనే కొత్త స్క్రిప్ట్‌లు తయారుచేసుకోవచ్చు.
నా కూతురు, నేను భిన్న ధృవాల్లాంటి వాళ్లం. తను నా సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం. ప్రతి విషయంలో సంప్రదాయబద్దంగా వుంటుంది. అందుకే తను నన్ను వేరే జాతిలా చూస్తుంది. నేను ఆమెకు జూలో జంతువులా కనిపిస్తాను. నేను బావిలో కప్పలా బ్రతుకుతున్నానని అనుకుంటుందామె. నేను అనుకునేలా ఈ ప్రపంచం లేదని చెబుతుంది. ఈ సినిమా కథను నా కూతురితో చర్చించాను. తను అవసరమైన సలహాలు ఇచ్చింది. వాటిని ఈ సినిమాలో సినిమాలో తీసుకున్నాను అన్నారు.
‘365 డేస్'లాంటి ప్రేమ, పెళ్లి కథ ఎంచుకోవడంపై చేయడంపై వర్మ స్పందిస్తూ....ప్రేమికుల్లోగాని, వైవాహిక జీవితంలో వున్న భార్యభర్తల మధ్యగాని చోటుచేసుకునే భావోద్వేగాలు, మనస్పర్థలు, ఇగో సమస్యల్లో సారుప్యతలుంటాయి. అందుకే 365డేస్ చిత్రానికి...ఇది అందరి పెళ్లికథ అనే క్యాప్షన్‌ను పెట్టాను. పెళ్లయిన కొత్తలో భార్యభర్తల మధ్య ఏదో తెలియని ఆకర్షణ వుంటుంది. రోజులు గడుస్తున్నా కొద్ది వారిలో మునుపటి ప్రేమ తగ్గిపోతుంటుంది. ఒకరి లోపాల్ని ఒకరు ఎత్తిచూపించుకునే పరిస్థితులొస్తాయి. వారి బంధంలో విభేదాలు రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. నా దృష్టిలో దానికి ఓ సంవత్సరం పడుతుందనుకుంటున్నాను. అందుకే 365డేస్ అనే టైటిల్ పెట్టాను.

వివాహ వ్యవస్థకు అర్థం లేదని నేను చెప్పలేదు. పెళ్లయిన ఎంతో మంది ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అది వేరే విషయం. ఈ చిత్రాన్ని పూర్తిగా పెళ్లిపట్ల నాకున్న దృక్కోణం నుంచే రూపొందించాను. నా దృష్టిలో ఇద్దరు కలిసి బ్రతకడం వేరు. ఒకరు లేకుండా ఒకరి జీవించకుండా వుండలేకపోవడం వేరు. నా మిత్రుడు ఒకతను ఓ అమ్మాయిని ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఏడురోజుల్లోనే వారు విడిపోయారు అని వర్మ తెలిపారు.
నేను నా భార్యతో విడిపోవడానికి పెద్దగా కారణాలేవి లేవు. ఆ సమయంలో నా జీవిత లక్ష్యాలు వేరుగా వుండేవి. ఓ గొప్ప చిత్రాన్ని తీసి పరిశ్రమలో బ్రేక్ సంపాదించుకోవాలనే తపన వుండేది. బాలీవుడ్‌లో కూడా రాణించాలనే ఆశయం వుండేది. అప్పుడు నా భార్యకున్న ప్రాధాన్యతలు వేరుగా వుండేవి. అందుకే భేదాభిప్రాయాలొచ్చాయి. ఎందుకు విడిపోయామని ఇప్పుడు ఆలోచిస్తే అలా చేయకుండా వుండాల్సిందేమో అనిపిస్తుంది. నేను తప్పుచేశానేమో అనిపిస్తుంది.
క్లీన్ సర్టిఫికెట్
‘శివ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసాడు. అందులో ఒక్కటంటే ఒక్క సినిమాకు కూడా సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు' సర్టిఫికెట్ ఇవ్వలేదు. తొలిసారిగా వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘365 డేస్' అనే సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ ఇవ్వడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. నందు, అనైక సోఠి జంటగానటించిన ఈ చిత్రాన్ని డి.వి.క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మించారు. సినిమాలో ఎలాంటి క్రైం సన్నివేశాలు లేకుండా చిత్రీకరించారు. మే 15న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఓ జంట ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా స్ర్కీన్ ప్లే ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. 365 డేస్ చిత్రం నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో క్రైమ్ లేదు. మంచి ఎమోషన్స్ తో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











