పరిటాల రవి జీవత ప్రేరణతోనే తీసా కానీ...వర్మ
ఇది పరిటాల రవి జీవితం ప్రేరణతో తీసిన సినిమాయే కానీ, వంద శాతం ఆయన జీవిత కథ కాదు. ఈ సినిమాలో పాటలు లేవు, కామెడీ లేదు, భారీ సెట్స్ లేవు, ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేవు. కానీ మానవ భావోద్వేగాలున్నాయి. ఆ భావోద్వేగాలతో మనిషి ఏం చేస్తాడనే వాస్తవిక కోణం ఉంది అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఆయన రూపొందించిన 'రక్త చరిత్ర' ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. అక్కడ వర్మ మాట్లాడుతూ ఇదివరకటి నా 'కంపెనీ'లో బిజినెస్, ఇంటలిజెన్స్ కూడిన వయొలెన్స్ వుంటే, 'రక్త చరిత్ర'లో భౌతికమైన హింస ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు.
ఒక సినిమాతో సందేశం ఇవ్వడం నా లక్ష్యం కాదు. 'వయొలెన్స్ కరెక్ట్ కాదు' అనే సందేశం కోసం ఈ సినిమా తీయలేదు. అయితే సినిమా ఏం చెప్పిందో జనం అర్థం చేసుకుంటారు. అలాగే అనంతపురంలో ఈ సినిమాని చూడాలనుకుంటున్నా. పరిటాల సునీత కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఎవరు ఈ సినిమాని చూడాలనుకుంటారో వాళ్లందరికీ ఈ సినిమాని చూపిస్తాం అని స్పష్టం చేసారు. ఇక వివేక్ ఓబరాయ్, సూర్య, శత్రుఘ్న సిన్హా ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందింది. సినర్జీ ప్రొడక్షన్ పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సి. కల్యాణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











