నట్టి కుమార్ చీటింగ్ కేసు మీద వర్మ వీడియో.. చిరంజీవి, సురేష్ బాబుని కూడా ఇలానే అంటూ!
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా డేంజరస్, ఇదే తెలుగులో 'మా ఇష్టం' , హిందీలో 'ఖత్రా' అనే టైటిల్ తో విడుదలకు సిద్దమయింది. అంతా బాగుంటే ఈ శుక్రవారం విడుదల అవ్వాల్సిన ఈ సినిమా అనుకోని చిక్కులు ఎదురవడంతో వాయిదా పైనుండి. ఈ సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఇక సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అంతేకాదు ఆయన వర్మ మీద సంచలన ఆరోపణలు చేశారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వర్మ స్పందించారు. ఆ వివరాలు

డబ్బు ఎగగొట్టాలన్న ఆలోచన
ఎక్కువగా వర్మ చేసిన సినిమాలతోనే నట్టి కుమార్ ఫేమస్ అయ్యారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలను విడుదల చేసిన నట్టి కుమార్ వర్మ చేసిన అనేక సినిమాల్లో భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బు ఫైనాన్స్ కూడా చేశారని చెబుతున్నారు. ఎన్నోసార్లు తనకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోవడంతో డబ్బు ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమై గట్టిగా నిలదీశానని పేర్కొన్నారు.

విడుదలకు ముందు రోజు
అలా తనకు, తన స్నేహితులకు కలుపుకుని దాదాపు 5 కోట్ల 29 లక్షల రూపాయలు వర్మ బాకీ ఉన్నారని, అవి ప్రతి సినిమాకు విడుదలకు ముందు 50 లక్షల రూపాయలు ఇస్తామని రాసి ఇచ్చిన వర్మ, చివరకు దానిపై కూడా నిలబడకుండా, 10 లక్షలు ఇస్తానంటే, మా ఇష్టం సినిమా విడుదలకు ముందు రోజు కోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు.

నట్టి కుమార్ సవాల్
తమలాగే వర్మ బాధితులు ఎందరో ఉన్నారని, అయితే వాళ్ళు బయటకు రాలేదని, తాను మాత్రమే ధైర్యంగా ఆయన చేస్తున్న మోసాలు బయట పెడుతున్నట్లు నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో కలసి సినిమాలు చేసి, వారిని ఆర్థికంగా మోసగించడం వర్మ పనిగా పెట్టుకున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. అంతేకాదు వర్మ ఎక్కడ చర్చకు వస్తాను అన్నా తాను సిద్ధమని నట్టి కుమార్ సవాల్ విసిరారు.

లైఫ్ అంతా ప్రెస్ మీట్ లే
అయితే ఇలా నట్టి కుమార్ చేసిన ఆరోపణల మీద వర్మ ఒక వీడియో విడుదల చేశాడు. నట్టి కుమార్ అనే వ్యక్తి నా పై చేసిన అభియోగాల గురించి నేను పట్టించుకోనని, ఆ విషయాలు అన్నీ నా లాయర్ లు చూసుకుంటారని అన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్ లో ఏమీ లేదని నేను అనుకుంటున్నానని అన్నారు. చిరంజీవి గారి మీద ఒకసారి.. సురేష్ బాబు మీద ఒకసారి.. ఇప్పుడు నామీద .. ఇలా తన లైఫ్ అంతా ప్రెస్ మీట్ లే ఉంటాయని వర్మ ఎద్దేవా చేశారు.

అందుకే వాయిదా వేశాం
ఆయన తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదని.. రావల్సిన కమీషన్ రాలేదని ఇండస్ట్రీలో కొందరిని ఆయన దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి' అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. అలాగే తన తాజా చిత్రం నా ఇషం వాయిదాపై కూడా ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. 'నా ఇష్టం సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణం కాదు. దానికి వేరే కారణం ఉంది. లెస్బియన్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం వల్ల చాలా థియేటర్లు మా చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేశాం' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











