RGV: జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే మగాడు.. ఇదొక సీరియస్ జోక్: రామ్ గోపాల్ వర్మ
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. అయితే ప్రస్తుతం స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెలలో టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హాజరయ్యారు. ఇటీవల హైదరాబాద్, కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లోని సభకు రామ్ చరణ్ తదితర సినీ ప్రముఖులు వచ్చారు. ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోడంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తారక్ పై ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
విమర్శలు-ప్రశంసలు:మే 28న నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి కాగా విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబులు ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును విమర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు ఆర్జీవీ. ఆ వివరాల్లోకి వెళితే..

నవ్వాలో-ఏడ్వాలో:"నేను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాలేదు. కానీ మీకు ఓ జోక్ చెప్పేందుకు వచ్చాను. అది చాలా సీరియస్ జోక్. ఎవ్వరూ నవ్వలేనటువంటి ఆ జోక్ ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు కూడా నవ్వాలో, ఏడ్వాలో అర్థం కానటువంటి జోక్ అది" అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఎన్టీఆరే చెప్పారు:"ఇంటి సభ్యుడు, అల్లుడు అయ్యుండి అంత దారుణంగా టార్చర్ చేసి, ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత మళ్లీ ఆయనే దండ వేసి అసలు ఎన్టీఆర్ లాంటి వాడు లేడని చెప్పడానికి మించిన జోక్ ఉండదనేది నా ఉద్దేశం. చంద్రబాబు ఎలాంటి వాడనేది స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పారు. దానికి కొత్తగా ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్ చేయాల్సిన పనిలేదు. మాట్లాడిన ప్రతిదీ రికార్డులో ఉంటుంది. దాని గురించి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు" అని ఆర్జీవీ అన్నారు.

ఎందుకు పూజిస్తున్నారు:"లక్ష్మీ పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారా లేదా.. రకరకాలుగా పలువురు చెప్పి ఉండవచ్చు. ఒకవేళ లక్ష్మీ పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారంటే ఆయనకు బుర్ర లేదనేది మీ ఉద్దేశ్యమా. సీఎం స్థాయి మనిషి.. బుర్ర లేకుండా లక్ష్మీ పార్వతి లాంటి ఒక అర్హత లేని మహిళ మాయలో ఆయన పడ్డారంటే మీరు ఇంకా ఎందుకు పూజిస్తున్నారు. ఎందుకు దండలేస్తున్నారు. కనీసం మీరు గతంలో చెప్పినదానిపై అయినా నిలబడాలి కదా" అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

ఒకే ఒక్క మగాడు:"శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్. ఎందుకంటే అంతపెద్ద సూపర్ స్టార్ కొడుకులు కానీ, వాళ్లెవరు రాకుండా చేసి ఈయన ఒక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు" అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

ఎన్టీఆర్ కు థ్యాంక్స్:"తారక్ రాకపోవడానికి తను ఏ కారణం చెప్పినా, చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం.. తాత గారి మీదున్న విపరీతమైన గౌరవంతోనే వీళ్లతో కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని రాలేదని నా నమ్మకం. కాబట్టి ఎన్టీఆర్ అభిమానిగా తారక్ కు నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతున్నా" అని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు.


Click it and Unblock the Notifications











