నా స్కూల్లో ఏమీ నేర్పను, టాలెంట్ వాడుకుంటా, అడుక్కునేవాళ్లు రావొద్దు: రామ్ గోపాల్ వర్మ
Recommended Video

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఆర్జీవీ అన్‌స్కూల్' పేరుతో ఓ ఫిల్మ్ స్కూల్ ప్రారంభించబోతున్నారు. శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ స్కూల్ నిర్వహించబడనుంది. దీనికి వర్మ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించబోతున్నారు. హైదరాబాద్, ముంబై, అమెరికాల్లో దీని శాఖలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఫీజు వివరాలు వెల్లడించనున్నారు. దీని గురించి వివరాలు వెల్లడిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

నేను పూర్ స్టూడెంట్, స్కూల్ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు
నేను స్కూల్ డేస్ నుండి చాలా పూర్ స్టూడెంట్. పదవ తరగతి, ఇంటర్, ఇంజనీరింగులో రెండేసి సార్లు ఫెయిల్ అయ్యాను. అలాంటి నేను స్కూల్ పెడతానని ఎప్పుడూ ఊహించలేదు అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

అడుక్కునే మెంటలాలిటీ ఉన్న వారికి చోటు లేదు
పూర్ స్టూడెంట్స్‌కు నా స్కూల్ లో చోటు లేదు. అడుక్కునే మెంటాలిటీ ఉంటే మా స్కూలుకు రావొద్దు. అలాంటి వారు ఇక్కడ నేర్చుకునే ఏమీ ఉండదు అని.... అని వర్మ ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఎవరికీ ఆఫర్లు ఇవ్వను, వారి టాలెంట్ వాడుకుంటా
నా స్కూల్‌లో చేరే వారికి నా సినిమాల్లో అవకాశాలు ఇస్తానని ఎవరూ భావించవద్దు. నా స్కూల్‌లో చేరిన వారి వద్ద టాలెంట్ ఉందని తెలిస్తే..... ఆ విషయం వారికి తెలిసే లోపు వాడుకుని సినిమా తీసి డబ్బు చేసుకుంటాను అని వర్మ తెలిపారు.

పాఠాలు, తరగతి గదులుండవు
నా స్కూల్‌లో పాఠాలు, తరగతి గదులు ఉండవు. ఇక్కడ ఏం నేర్పరు. మీలో ఉన్న ప్రతిభని వెలికితీసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. ‘బ్లాక్ బ్లస్టర్ సినిమా ఎలా తీయాలి' అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఓ కథని పదిమంది దర్శకులకు ఇస్తే పది రకాలుగా తీస్తారు. ఎవరి ఆలోచనా పరిధి వాళ్లది. ఆ ఆలోచనల్ని విస్తరించేందుకు ‘అన్‌స్కూల్' ఉపయోగపడుతుంది... అని వర్మ తెలిపారు.

ప్లాప్ సినిమాల గురించి చెబుతాను
నేను ఈ స్కూల్‌లో నా హిట్ సినిమాల గురించి మాట్లాడను... కేవలం నేను తీసిన ప్లాపు సినిమాల గురించే మాట్లాడతాను. సినిమా ఎందుకు హిట్ అయిందో చెప్పడం కంటే... ఎందుకు ప్లాప్ అయిందో చెబితేనే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది అని వర్మ తెలిపారు.

ఇపుడున్న స్కూల్స్ సరిగా లేవు
ఇప్పుడున్న ఫిల్మ్ స్కూల్స్ ఇంకా పాత పద్దతులనే అనుసరిస్తున్నాయి. హిట్ సినిమాలు, గొప్ప దర్శకుల గురించే బోధిస్తున్నాయి. ఇది సరైన పద్దతి కాదు. మన ఒక విషయాన్ని ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. కొన్ని షార్ట్ ఫిల్మ్ నుండి కూడా మనం ఎంతో నేర్చుకునేది ఉంటుంది..... డిఫరెంట్‌గా నా స్కూల్ బోధనా పద్దతులు ఉంటాయి అని వర్మ తెలిపారు.

నా లాంటి టెర్రరిస్టులను ఇండస్ట్రీ మీదకు వదులుతా
నన్నందరూ సెల్యులాయిడ్ టెర్రరిస్ట్ అంటున్నారు. నాలాంటివాళ్లని మరింతమందిని తయారు చేసి సినిమా ఇండస్ట్రీ మీదకు వదులుతా అంటూ వర్మ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శివ సమయంలో నేను అన్ని రూల్స్ పక్కన పెట్టి నాకు నచ్చినట్లు సినిమా తీశాను. సొంతగా ఆలోచించడం గురించి నా స్కూల్ లో ప్రత్యేకంగా నేర్పించడం జరుగుతుంది.... అన్నారు.
దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా...
ఈ స్కూల్‌లో సీటు దొరకాలంటే మీలో ఉండే టాలెంటే అన్నికంటే ముఖ్యమైన పెట్టుబడి. దాన్ని నిరూపించుకునేందుకు మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ వర్మ ఓ పోస్టు చేశారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











