రాంగోపాల్ వర్మకు జీఎస్టీ షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం?
Recommended Video

జీఎస్టీ నిర్మాణ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు సీసీఎస్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తాను స్కైప్ ద్వారా ఈ సినిమాను విదేశాల్లో నిర్మించారని చెప్పిన వర్మ మాటల్లో వాస్తవం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ఆయన వివరణ తమను తప్పుదారి పట్టించేలా ఉందని ఓ అంచనాకు వచ్చిన పోలీసులు అరెస్టు చేసేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్టు ప్రముఖ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

స్కైప్ చిత్రీకరణపై అనుమానాలు
వెబ్ డాక్యుమెంటరీ గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) వివాదంపై ఇప్పటికే రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. గత శనివారం మూడున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని స్వదేశంలో తీయలేదు. పోలెండ్‌లో చిత్రీకరించాను. అది కూడా స్కైప్ ద్వారా వీడియోను చిత్రీకరించాను అని విచారణలో వర్మ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

వర్మ తప్పుదోవ పట్టించారా?
జీఎస్టీ నిర్మాణ విషయంలో వర్మ తమను తప్పుదోవ పట్టించినట్లుగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. విచారణ అనంతరం వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా భావిస్తున్నట్టు సమాచారం.

వర్మ రెండోసారి విచారణ
జీఎస్టీ కేసు విషయంలో వర్మను మరోసారి సీసీఎస్ పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. వర్మ వెల్లడించిన విషయాలపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి రెండోసారి విచారిస్తాం అని పోలీసులు పేర్కొన్నట్టు కథనంలో పేర్కొన్నారు.

వర్మ దొరికిపోయిందిలా..
విదేశాల్లో చిత్రీకరించారంటున్న జీఎస్టీని స్వదేశంలో డౌన్‌లోడ్ చేసుకొన్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. అదే జీఎస్టీని తిరిగి ఇండియా నుంచే అప్‌లోడ్ చేసిన విషయంలో వర్మ దొరికిపోయినట్టు దినపత్రిక వెలువరించిన కథనంలో పేర్కొన్నారు.

శుక్రవారం లేదా సోమవారం వర్మ విచారణ
వర్మను శుక్రవారం గానీ, సోమవారం గానీ రెండోసారి విచారించే అవకాశం ఉంది. అనంతరం ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వర్మ చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవం అని పోలీసులు తేల్చినట్టు తెలుస్తున్నది.

విదేశాలకు వెళ్లడంపై విచారణ
కాగా, పోలెండ్, బ్రిటన్‌లో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని విచారణ సందర్భంగా వర్మ వెల్లడించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆయా దేశాలకు వర్మ వెళ్లాడా లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

దోషిగా రుజువైతే కఠినశిక్షే
అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసు సాధారణమైనది కాదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఆషామాషీగా కేసును విచారించలేమని, ఈ వ్యవహారంలో వర్మ దోషిగా తేలితే ఏడేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉన్నదని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి కేసుల్లో తీవ్రతను బట్టి శిక్షలు పడ్డాయని తెలిపారు.

సామాజిక కార్యకర్తలకు వర్మ సారీ
జీఎస్టీ వ్యవహారంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహిళా సంఘం నేతలు దేవీ, మణికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. జీఎస్టీ సినిమా వివాదంపై డిబేట్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వాళ్లను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీవీ చానెల్ డిబేట్ సందర్భంగా తమను అవమానించే విధంగా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో కూడా సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

వర్మ సారీ చెప్పినా ఒప్పుకోం..
విచారణ అనంతరం సామాజిక కార్యకర్తలకు వర్మ చెప్పిన క్షమాపణలను ఐద్వా నేత మణి స్వీకరించలేదు. తనను రాంగోపాల్ వర్మ దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి చిత్రంలో తనను పెట్టి సినిమా తీస్తానని వర్మ చాలా దిగజారి మాట్లాడారు. ఆయన చెప్పిన సారీ నేను అంగీకరించడం లేదు. ఆయనకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని అని మణి తేల్చి చెప్పారు.

శిక్షపడాల్సిందేనట
ఆడవాళ్లని అవమానించిన వారికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష వర్మకు పడాలని మణి ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మణి క్షమాపణలు స్వీకరించని అంశంపై కూడా వర్మ స్పందించారు. కేసును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











