నన్ను రెచ్చగొడితే అంతే..వర్మ
నేనంటే వాళ్లకి ఎందుకో చాలా ఇష్టం! నన్ను రెచ్చగొడుతుంటారు. నేను ఏదో ఒకటి మాట్లాడితే వారికి అది ప్రధాన వార్త అవుతుంది. అంటూ మీడియా గురించి చెప్పుకొచ్చారు వర్మ. మీడియా ఎప్పుడూ మీ చుట్టూనే తిరుగుతుంటుంది..అంటూ మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామ్ గోపాల్ వర్మ ఇలా వివరణ ఇచ్చారు.అదే విషయంపై మాట్లాడుతూ గతంలో ఓ విలేకరి 'మీడియా మీ గురించే ఎందుకు రాస్తుంటుంది'? అని నన్ను అడిగాడు. దానికి ఒకటే సమాధానం...సంజయ్ లీలా భన్సాలీ 'సావరియా' తీసినప్పుడు ఆయన గురించి 15-20 రోజులు తెగ రాసేశారు. మళ్లీ ఆయన గురించి రాయాలంటే రెండేళ్లుపడుతుంది మరి. నేనో మూడు నెలలకో సినిమా తీస్తాను. కాబట్టి ఎప్పుడూ అందుబాటులో ఉంటా అన్నారు. అలాగే మరి మీడియాని విమర్శిస్తూ మీడియాపై రణ్ చిత్రం తీస్తున్నారు..ఎందుకంత కోపం అంటే..దానికిలా వర్మ సమాధానమిచ్చారు.
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకొంటున్నారు. 'రణ్' గురించి నేను ఒకలా చెబితే ఇంకోలా ప్రచారం సాగుతోంది. మీడియాలో ముఖ్యంగా న్యూస్ ఛానెళ్లలో జరిగే అంతర్గత వ్యవహారాల్నే ప్రజలకు చూపించబోతున్నాను. టీఆర్ పీల కోసం వాళ్లు వెంపర్లాడుతున్న తీరునే నా రణ్ లో చూపెట్టాను అన్నారు. అలాగే 'రణ్' వివాదం గురించి మాట్లాడుతూ..రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని నేను కించపరిచేలా మార్చానని సెన్సార్ వాళ్లు అభ్యంతరం తెలిపారు. దీన్ని నేను అంగీకరించను. అందుకే సుప్రీంకోర్టుకైనా వెళ్లి అనుమతి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. భవిష్యత్తు భారతం ఎలా ఉండాలన్న ఆకాంక్షతో ఠాగూర్ ఆ రోజుల్లో జాతీయ గీతాన్ని రాశారు. కానీ 60 ఏళ్ల తరవాత మన దేశంలో జరుగుతున్నదేమిటి? దీన్ని వెలుగులోకి తీసుకురావాలనే 'జనగణమణ' గీతాన్ని నా తరహాలోకి మార్చి 'రణ్' లో వాడాం అని సమర్ధించుకున్నారు.


Click it and Unblock the Notifications











