ఆ ఇద్దరు హీరోలను తొక్కేస్తారా? టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య జరుగుతున్న టికెట్ రేట్ల వివాదం, సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు తదితర వివాదాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇటీవల పలు టెలివిజన్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌తో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు. టికెట్ల రేట్ల తగ్గింపుపై వర్మ ఏమన్నారంటే..
Recommended Video

ఉత్పత్తిదారుడుకి ధర నిర్ణయించే అధికారం
ఒక వస్తువును ఎవరైనా ఉత్పత్తిదారుడు తయారు చేసిన తర్వాత వినియోగదారుడికి అమ్మేందుకు ఒక ధర నిర్ణయిస్తాడు. తనకు అయిన వ్యయం, తన శ్రమకు ఫలితాన్ని జోడించి ధరను నిర్ణయించుకొంటాడు. వినియోగదారుడు నచ్చితే కొంటాడు. లేకపోతే ఉత్పత్తిదారుడు నష్టపోతాడు. ఒకవేళ వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. దానిపై ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. అంతే తప్పా ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

రేకుల షెడ్డుకు మల్టీ ప్లెక్ష్‌కు ఇకే రేటా?
అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా తీసే సినిమాలను మల్టిప్లెక్స్‌లోను, రేకులతో వేసిన థియేటర్‌లో ఒకే రేటు విధించడం సరికాదు. ఇలాంటి లాజిక్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఉదాహరణకు ఇడ్లీ తయారు చేయాలంటే.. దానికి కావల్సిన ముడిసరుకు ఒకటే ఉంటుంది. కాక హోటలైనా, స్టార్ హోటలైనా ఆ పదార్థాలతోనే ఇడ్లీలు చేస్తారు. అప్పుడు కాకా హోటల్ ఉండే రేటునే ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలంటే అది కరెక్ట్ లాజిక్ కాదు. సినిమాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అని వర్మ తన లాజిక్‌తో ప్రశ్నించారు.

పేర్ని నాని, అనిల్ కుమార్‌పై సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆర్జీవి తప్పుపట్టారు. హీరోల రెమ్యునరేషన్ల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హీరోల రెమ్యునరేషన్ కూడా నిర్మాణ వ్యయంలో భాగమే. రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం వేర్వేరు కాదు. సినిమా తీస్తున్నారంటే.. హీరోను చూడటానికే థియేటర్‌కు ప్రేక్షకుల వస్తారు. అత్యధిక రెమ్యునరేషన్ హీరోలకు ఇవ్వడానికి కారణం వారికి ఉన్న బ్రాండ్ కారణమని అని ఆర్జీవి తెలిపారు.

ప్రేక్షకుడికి నచ్చితే సినిమాకు వస్తారు లేదంటే...
సినీ నిర్మాత ఎవరైనా సినిమాను తీసి.. తన మూవీకి టికెట్ ధర నిర్ణయించుకొంటే తప్పేమి లేదు. ప్రేక్షకుడికి నచ్చితే సినిమాకు వస్తారు లేదంటే నిర్మాత నష్టాల్లో మునిగిపోతాడు. ఉదాహరణకు రాజమౌళి, శోభు యార్లగడ్డ కలిసి బాహుబలిని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వాళ్లు అంత బడ్జెట్‌తో నిర్మించడం కారణం.. తమ ప్రొడక్ట్‌పై ఉన్న నమ్మకమే అందుకు కారణం. ఒకవేళ నష్టం వస్తే రాజమౌళి, శోభు యార్లగడ్డ భరిస్తారు. విజయం సాధిస్తే సినీ పరిశ్రమకు మొత్తం ఆ క్రెడిట్ లభిస్తుంది అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

హీరోలను తొక్కేదామనుకొంటే..
టికెట్ల రేట్లు తగ్గించడం వెనుక ఓ ఇద్దరు ప్రముఖ హీరోలను తొక్కేయడం అనే ఆరోపణల గురించి నాకు తెలియదు. టికెట్ రేట్లు తగ్గిస్తే.. హీరో సినిమాలకు ఏమీ కాదు. ఓ పది కోట్లు నష్టపోతారేమో.. కానీ నష్టపోయేది సినిమాకు పనిచేసిన సిబ్బంది నష్టపోతారు. నిర్మాత తన సినిమాకు పనిచేసే టెక్నిషియన్స్‌కు, ఇతర సిబ్బందికి కోత పెడుతారు అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

సమస్యలను ఏపీ సర్కార్ పరిష్కరించాలి
టికెట్ల రేట్లు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదు. కానీ ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం పరిష్కరించాలి. సినిమా పరిశ్రమకు నష్టం కలిగిస్తున్న కోవిడ్‌ను ఏమి చేయలేం.. అలాగే ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమీ చేయలేం. ఈ రెండింటిని భరించాల్సిందే అని వర్మ అనడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











