YS Jagan: ఏపీ ప్రభుత్వంపై వర్మ సంచలన వ్యాఖ్యలు.. కరోనాలాగే వాళ్లనూ భరించాలి అంటూ దారుణంగా!
పేరుకు తెలుగు దర్శకుడే అయినా.. చాలా తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలోనే గొప్ప గొప్ప సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా మూవీలు చేస్తూ సందడి చేస్తూనే ఉన్నాడు. అయితే, ఈ మధ్య ఆయన పంథాను మార్చుకుని విచిత్రమైన చిత్రాలు చేస్తున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలవడంతో పాటు వివాదాల్లోనూ భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న టికెట్ ధరల వివాదం గురించి రాంగోపాల్ వర్మ స్పందించాడు. ఆ సంగతులు మీకోసం!

సినిమా టికెట్ రేట్లు తగ్గుదల
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రాష్ట్రంలోని థియేటర్లలో ఏరియాను బట్టి రేట్లను నిర్ణయించారు. ఆ ధరలకే టికెట్లు అమ్మాలని కఠినంగా హెచ్చరించారు. దీంతో ఏపీలో దీనిపై పెద్ద వివాదమే మొదలైంది.

థియేటర్లపై దాడులు.. బంద్
సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జాయింట్ కలెక్టర్ల అనుమతితో రేట్లు పెంచుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి జేసీలు తమ పరిధిలోని థియేటర్లను తనిఖీ చేసి కొన్నింటిని సీజ్ చేశారు. మరికొందరు రేట్లు తక్కువగా ఉండడంతో బంద్ చేసేశారు.

వాళ్లకు ఉపశమనం కలిగిస్తూ
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అధికారులు సీజ్ చేసిన 83 థియేటర్లను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, నాలుగు వారాల్లోగా ఆ థియేటర్ల యాజామాన్యాలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. ఇవన్నీ జనవరి 7 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఆరోజు ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

వివాదంపై వర్మ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న టికెట్ ధరల వివాదంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. 'ఏదైనా ఓ వస్తువును ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తే.. దాని ఎమ్మెర్పీ నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది. దానిని కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు ఇష్టం మాత్రమే' అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.

ఏపీ ప్రభుత్వానికి తప్పేనని
టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాంగోపాల్ వర్మ తప్పబట్టాడు. 'వస్తువును వినియోగదారుడికి అమ్మే విషయంలో ప్రభుత్వానికి పన్నులు మాత్రమే వెళ్తాయి. అందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించదు. సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడమేంటో అర్థం కావడం లేదు' అంటూ విమర్శించాడీ డైరెక్టర్.
Recommended Video

కరోనాలా వాళ్లను భరించాలి
ఇక, తాజాగా ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న రాంగోపాల్ వర్మ మరోసారి టికెట్ రేట్ల వివాదంపై స్పందించాడు. 'దేనికైనా, ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్లు ఏం చేస్తారు? ఏం చేయరు? అని చూస్తాం. కరోనాను మనం ఏమీ చేయలేం. అలాగే, ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమీ చేయలేం. దాన్ని భరించినట్లే.. దీన్ని కూడా భరించకతప్పదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Click it and Unblock the Notifications











