Telangana Election Result: రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తెలంగాణ సీఎం ఆయనే అంటూ!
తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విజయం తమది అంటే తమది అంటూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేశాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ, ఎమ్‌ఐఎంలు సైతం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్స్ అవుతామని ఆశాభావంతో ఉన్నాయి.
ఎన్నో ఊహాగానాల నడుమ తెలుగు ప్రజలే కాకుండా దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా వేచి చూసిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇందులో దాదాపు పదేళ్ల పాటు అధికార పక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS)కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆరంభం నుంచి స్పష్టమైన మెజారిటీని కనబరుస్తూ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎంతో మంది నాయకులు, ప్రముఖులు ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ ఎలక్షన్ రిజల్ట్‌పై స్పందించారు. అదే సమయంలో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై కూడా కామెంట్ చేశారు.
తెలంగాణలో వెలువడుతోన్న ఎన్నికల ఫలితాలపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. 'హాయ్ రాహుల్ గాంధీ జీ, సోనియా గాంధీ జీ.. సుదీర్ఘ కాలంలో తొలిసారిగా నాకు కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన గౌరవం కలుగుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్, రేవంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ 'మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి.. తెలంగాణలో ఇది రేవంత్ రెడ్డి గెలుపు తప్ప.. పార్టీ గెలుపు కాదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బాహుబలిని పొందినందుకు స్టార్స్‌కు థ్యాంక్స్ చెప్పాలి' అని చెప్పుకొచ్చాడు. ఇంకో ట్వీట్‌లో వర్మ 'తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని తెలిసి గర్వంగా ఉంది' అని రాసుకొచ్చాడు.

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆయనకు చాలా మంది మద్దతుగా పోస్టులు పెడుతుండగా.. కొందరు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ ఆంధ్రా రాజకీయాలపైనే ఫోకస్ చేసే వర్మ.. తొలిసారి తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించి హైలైట్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా వెలువడుతోన్న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 65 సీట్లు దక్కించుకునే దిశగా వెళ్తోంది. అలాగే బీఆర్ఎస్ 40, బీజేపీ 8, ఎంఐఎం పార్టీ 6 స్థానాలను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ (60)ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.


Click it and Unblock the Notifications











