‘వెన్ను పోటు’ సాంగ్ వివాదం: తిరిగి కేసు పెట్టిన ఆర్జీవీ... ఎమ్మెల్యేకు 48 గంటల డెడ్‌లైన్!
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించిన 'వెన్నుపోటు సాంగ్' వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల ఈ పాట విడుదల చేయగా టీడీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ పాట తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేయడంతో పాటు వర్మ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్వీ మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. తన లాయర్ ప్రభాకర్ శ్రీపాద ద్వారా ఈ నోటీలు పంపారు.

మీరు ఆ కేసు పెట్టడానికి అర్హులు కాదు
మీ పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కించపరిచే విధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' టీజర్ ఉందని మీరు కేసు పెట్టారు. కానీ మీకు ఈ విధంగా కేసు పెట్టే అర్హత లేదు. ఎవరైతే పరువు పోయినట్లు భావిస్తారో వారికి మాత్రమే అలాంటి కేసు పెట్టే అర్హత ఉంది.... అని వర్మ తరుపు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

కేసు నిలబడదని తెలిసినా ఉద్దేశ్య పూర్వకంగా
ఈ కేసు నిలబడదని తెలిసినా... కావాలని ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారని.... దీని వల్ల తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ ప్రతిష్ట దెబ్బంది అని ప్రభాకర్ శ్రీపాద నోటీసుల్లో పేర్కొన్నారు.

వర్మ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగింది
నా క్లయింట్ రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ సహా పలు భాషల్లో 50పైకి పైగా సినిమాలు రూపొందించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తన వృత్తిలో ఎంతో గౌరవం సంపాదించుకున్నారు. పొలిటికల్ థీమ్‌తో సర్కార్, రక్త చరిత్ర లాంటి సినిమాలు చేసి ప్రజల మెప్పుపొందారు. అలాంటి నా క్లయింట్ మీద తప్పుడు కంప్లయింట్ చేయడం వల్ల అతడి పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని లీగల్ నోటీసుల్లో ప్రభాకర్ పేర్కొన్నారు.
48 గంటల్లో క్షమాపణ చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలి
48 గంటల్లో నా క్లయింట్ రామ్ గోపాల్ వర్మకు ప్రజల సమక్షంలో క్షమాపణలు చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో చట్ట పరంగా (సివిల్, క్రిమినల్) చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని... రామ్ గోపాల్ వర్మ తరుపున ప్రభాకర్ శ్రీపాద నోటీసులు పంపారు.


Click it and Unblock the Notifications











