What is Your Film? రాంగోపాల్ వర్మ కొత్త స్కెచ్.. ఆడియెన్స్ చేతుల్లో సినిమా మేకింగ్!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మేకింగ్, టెక్నాలజీలో కొత్త ఐడియాలను ప్రవేశపెడుతూ తన అభిమానులను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే కోవలో యువర్ ఫిల్మ్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఆయన తెరపైకి తెచ్చారు. ఆర్జీవి డెన్ బ్యానర్‌పై ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నారు. సినిమా భవిష్యత్ ఆడియెన్స్ చేతులో ఉండటంతో వారి నుంచి అభిప్రాయలను తీసుకొనే కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్జీవి డెన్. కామ్ వెబ్ సైట్ ద్వారా సినిమా కాన్సెప్ట్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇతర టెక్నిషియన్లను ఎంపిక చేసే అవకాశాన్ని ప్రేక్షకుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుండటం విశేషంగా మారింది. మీకు నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించే ప్రక్రియలో భాగం అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. మీ మైండ్‌లో ఉన్న కథను కూడా సినిమాగా తీసే అవకాశం కల్పిస్తున్నారు.

ఆర్జీవి కొత్త ప్లాన్ ప్రకారం.. మీకు నచ్చిన కథ మీ వద్ద ఉంటే.. రెండు, మూడు లేదా ఓ పేరాగ్రాఫ్‌లో రాసి వెబ్‌సైట్‌లో మీ స్టోరీ ఐడియాను షేర్ చేసుకోవచ్చు. కేవలం కథనే కాకుండా యాక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఈ బ్యానర్ రూపొందించే సినిమాలో భాగం కావొచ్చు. అయితే దరఖాస్తు చేసుకొన్న క్యాండిడేట్స్‌ను ఎంపిక చేసి వారికి ఆడిషన్స్‌ను ఆర్జీవి స్వయంగా నిర్వహిస్తారు. ఒక సినిమాకు ఎవరు యాక్టర్లుగా ఉండాలి. ఎలాంటి సాంకేతిక నిపుణులుగా ఉండాలనే ఛాయిస్ ప్రేక్షకులకు వదిలేస్తారు.
సినిమా నిర్మాణాన్ని ఏకంగా ప్రేక్షకుల ముంగిట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఆర్జీవి చేస్తున్నారు. తమకు నచ్చిన సినిమాకు ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే బాధ్యత, హక్కును స్వేచ్చగా కల్పించనున్నారు. ఆర్జీవి చేపట్టిన ఈ విధానం సినిమా పరిశ్రమ దిశను మారుస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











