‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో రిలీజ్ డేట్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నా ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో ఆగస్టు 23న శిల్పకళా వేదికలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. "ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లను దృష్టిలో పెట్టుకుని గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరణ ఇస్తున్నాను. 'రామయ్య' ఆడియో ఆగష్టులో వుంటుంది. సినిమాను ఇంతకు ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తాం. ఇందులో ఏ మార్పూ లేదు. ఏది ఏమైనా ఇది జరిగితీరుతుంది" అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు ఏ రేంజిలో అదరగొడతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత కష్టమైన డైలాగైనా, ఎంత పొడవాటి డైలాగైనా అవలీలగా.....సన్నివేశానికి తగిన విధంగా పర్ ఫెక్టుగా చెప్పడం జూ ఎన్టీఆర్ స్టైల్. ఎన్టీఆర్ మెమోరీ పవర్ చూసి ప్రేక్షకులే కాదు...దర్శకులు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం. హరీష్ శంకర్ కూడా జూ ఎన్టీఆర్ స్టామినా చూసి అవాక్కయ్యాడు. 'జూ ఎన్టీఆర్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టుతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో పని చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందనే టెన్షనే ఉండదు. ఆయనది నమ్మశక్యంకాని మెమోరీ పవర్' అంటూ ట్వీట్ చేసాడు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. బాద్‌షా తర్వాత ఎన్టీఆర్, గబ్బర్‌సింగ్ తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పంచ్ డైలాగ్స్, ఆయన ఎమోషనల్ కేరక్టర్ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్ శంకర్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications












