బాలకృష్ణ ఫ్యాన్స్ ఆందోళనకు సిద్దమంటూ హెచ్చరిక
హైదరాబాద్ : ''ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయం చేస్తుందని ఎదురుచూస్తున్నాం. న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణగారి అభిమానులు ఆందోళ జరపడానికి సిద్ధమవుతున్నారు. వారం రోజులకే బాగా ఆడుతున్న సినిమాను తీసేయడం దారుణం. కొంతమంది చేతుల్లోకి థియేటర్లు వెళ్లిపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ విషయంలో నేను పోరాడతాను''అని రమేష్ పుప్పాల చెప్పారు. హైదరాబాద్‌లోని అర్జున్ థియేటర్‌లో 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని తీసేసి గురువారం 'శిరిడిసాయి' చిత్రం ప్రదర్శించడంపై ఆయన తన ఆభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా వారితో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ...''ఈ విషయంలో చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకొన్న నిర్ణయాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. బాగా ఆడుతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని తీసివేయడం భావ్యం కాదని... కూకట్‌పల్లిలో ఏదో ఒక థియేటర్‌లో సినిమాని ప్రదర్శించాలని వాణిజ్య మండలి, తెలంగాణ పంపిణీదారుల సంఘం, ప్రదర్శనదారుల సంఘం సమష్టిగా నిర్ణయం తీసుకొన్నాయి. అందులో భాగంగా విశ్వనాథ్ థియేటర్‌ని మంజూరు చేశారు. అయితే ఈ రోజు ఆ థియేటర్‌లో కూడా 'శిరిడిసాయి' సినిమాని ప్రదర్శిస్తున్నారు. థియేటర్ల గుత్తాధిపత్యం వల్లే ఇదంతా జరుగుతోంది. ఒకే సినిమాని రెండు మూడు థియేటర్లలో ఆడిస్తారు కానీ.. బాగా ఆడుతున్న సినిమాకి ఒక్క థియేటర్ కూడా దక్కడం లేదు. ఛాంబర్ నిర్ణయాన్ని బేఖాతరు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి. కూకట్‌పల్లిలోని ఏదో ఒక థియేటర్‌ని మంజూరు చేయకపోతే... రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఆందోళనకు దిగుతార''ని హెచ్చరించారు.
బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై సినీ దర్శకనిర్మాతలు, హీరో అభిమానులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని వారం రోజులుగా ప్రదర్శిస్తున్నారు. పంపిణీదారులతో వారం రోజులపాటు ఆ చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం బుధవారంతో ముగిసింది. గురువారం నుంచి 'శిరిడిసాయి' సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, దర్శకుడు రవికుమార్ చావలి, రచయిత ఘటికాచలం తదితరులు అర్జున్ థియేటర్ ముందు ధర్నాకు దిగారు.
తమ చిత్రానికి వసూళ్లు వస్తుండగా తొలగించడమెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని రోజులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసిందనీ, అందువల్లే 'శిరిడిసాయి' ప్రదర్శించేందుకు నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. కొందరు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులు, సినీ నిర్మాత, దర్శకుడికి వెంటనే ఆందోళన విరమించాలని చెప్పారు. అయినప్పటికీ వినకపోవడంతో అభిమానులను చెల్లాచెదురు చేసి నిర్మాత, దర్శకుడు, కొందరు అభిమానులను అదుపులోకి తీసుకొని తరవాత సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడారు.


Click it and Unblock the Notifications











