చిరంజీవికి ‘ఖైదీ’..రాణాకి ‘బీటెక్ బాబు’
చిరంజీవికి 'ఖైదీ' ఎలా అయ్యిందో ఈ సినిమా రాణాకి అలా అవుతుంది. ఇందులో రాణా 'బీటెక్ బాబు'గా నటిస్తున్నాడు. 'ఆరున్నర అడుగుల' రాణా కటౌట్‌ను సంపూర్ణంగా, అర్థవంతంగా ఈ సినిమాలో వాడుకుంటానని ఆయన అభిమానులకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు క్రిష్. రాణా హీరోగా ఆయన రూపొందిస్తున్న 'కృష్ణం వందే జగద్గురుం'చిత్రం ఓపెనింగ్ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే...ఈ కథ ఆలోచన రాగానే రాణాకి ఫోన్ చేసి, ఓ కథ దొరికింది, దీనికి నువ్వే సూట్ అవుతావన్నాను. రాణాకి కూడా ఈ కథ నచ్చింది. ఈ సినిమా మా ఇద్దరి గతిని మార్చేస్తుంది. మొదట ఈ చిత్రాన్ని వెంకటేష్‌తో అనుకోవడం జరిగింది. కానీ స్క్రిప్టు పూర్తిగా గమనించిన తర్వాత రాణాతో చేయడమే కరెక్ట్ అనుకున్నాను. వారి కుటుంబంతో నాకు వున్న అనుబంధం, రాణాతో ఉన్న స్నేహం దృష్టిలో పెట్టుకుని మాత్రం కాకుండా కేవలం కేరక్టరును దృష్టిలో పెట్టుకునే అతన్ని సెలక్ట్ చేసుకున్నాను అన్నారు.
ఇక ఈ చిత్రంలో రాణా క్యారక్టైరైజేషన్ గురించి చెపుతూ..బండి కనపడితే మాయం చేసేశాడు 'గమ్యం'లో గాలి శీను. 'వేదం'లో కేబుల్ రాజుకీ చేతివాటం ఎక్కువే. ఇద్దరూ తమ తమ చేష్టలతో మహా మాస్ అనిపించుకొన్నవారే. వీరిద్దరి కన్నా పరమ మాస్ మా బీటెక్ బాబు అన్నారు క్రిష్.ఇక...''గమ్యం, వేదం.... ఈ రెండు సినిమాల్నీ కథను నమ్మి తీశాను. ఇది కూడా అంతే. టైటిల్ వెంకటేష్ కోసం అనుకొన్నదే. కానీ ఈ కథ పూర్తిగా వేరు. దీనికి రాణా మాత్రమే సరిపోతాడు. ఆయన బీటెక్ బాబుగా కనిపిస్తారు. శ్రీకృష్ణుణ్ని మించిన మాస్ హీరో మనకెవరూ లేరు. ఆయన తత్వానికీ ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటనేది మాత్రం సస్పెన్స్'' అన్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: బిబో శ్రీనివాస్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కూర్పు: శ్రావణ్ .కె, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్


Click it and Unblock the Notifications











