హిందీ బేబీతో ఎంజాయ్ చేస్తున్న హీరో రానా
హైదరాబాద్: తెలుగు హీరో రానా దగ్గుబాటి బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ‘బేబీ' అంటే కొంపతీసి అమ్మాయి అని మాత్రం ఊహించుకోవద్దు. ఇది బాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమా పేరు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, తాప్సీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రానా ఓ చిన్న పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి రానా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘బేబీ' సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. షూటింగులో బాగా ఎంజాయ్ చేసాను. ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా గ్రేట్‌గా భావిస్తున్నాను. నీరజ్ పాండే, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తదితరులతో కలిసి నటిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు.

గతంలో రానా బాలీవుడ్లో తెరకెక్కిన ‘దమ్ మారో దమ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్లో కెరీర్ మొదలు పెట్టిన రానా అక్కడ నిలదొక్కుకోలేక పోయినా....అప్పుడప్పుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దీంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం రానా తెలుగులో ‘బాహుబలి', ‘రుద్రమదేవి' లాంటి భారీ ప్రాజెక్టుల్లో కీలకమైన పాత్రలు పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications










