నిజాయతీతో మెలిగే ఓ ‘రిపోర్టర్’ కథ
హైదరాబాద్: 'గంగపుత్రులు' ఫేమ్ రాంకీ హీరోగా జిఆర్‌కె ఫిలింస్ పతాకంపై మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రిపోర్టర్'. జి.రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నిజాయతీ, అంకితభావంతో పని చేసే ఒక గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత జి.రామకృష్ణ మాట్లాడుతూ ''నిజాయతీతో మెలిగే ఓ పాత్రికేయుని కథ ఇది. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. మంగళవారం నుంచి రెండో షెడ్యూలు మొదలవుతుంది.యూనిట్ సహకారంతో తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తిచేశాం. 4 నుండి నెలాఖరువరకు రెండో షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ, పాటలు పూర్తి చేస్తాము''అన్నారు.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. ఆ మాట అక్షరాలా నమ్మి పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టాడో యువకుడు. గుండె నిండా ఆశయం నింపుకొన్న అతనికి... అక్కడ ఊహించని పరిణామాలు స్వాగతం పలికాయి. ఈ రంగంలో నెగ్గుకురావడం అనుకొన్నంత సులభం కాదు అనే విషయం అర్థమైంది. అయినా సరే... పట్టు వదలకుండా పోరాటం సాగించాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మహేష్ కత్తి.
గంగపుత్రులు చిత్రం తర్వాత సమాజానికి వెన్నముకవంటి విలేఖరి పాత్రలో నటించడం సంతోషంగా వుందని రాంకీ తెలిపారు.చైత్ర, సురేష్, చలపతిరావు, సునీతారాణా, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:జోష్వా భట్ల, కెమెరా:ముజీర్ మాలిక్, మాటలు: బి.సత్యప్రసాద్, ఆర్.వంశీమోహన్, నిర్మాత:జి.రామకృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మహేష్ కత్తి.


Click it and Unblock the Notifications












