దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రవిబాబు త్వరలో 'అవునా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తకిటతకిట హీరో హర్షవర్ధన్ రానె హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో పూర్ణ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చివరగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'నువ్విలా' చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ తాజా చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సినిమా జయాపజయాలను పక్కన పెడితే సినిమాను వైవిద్యంగా తెరకెక్కించడం రవిబాబు స్పెషాలిటీ. దీనికితోడు ఆయన సినిమాల్లోని సంగీతం కూడా వీనులవిందుగా ఉంటుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.