భారీ సెట్స్ కు 'బై..బై' చెప్పిన గుణశేకర్..క్లాప్ కొట్టిన రాజమౌళి..!?
మామూలుగా గుణశేఖర్ సినిమాలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారీ సెట్లు, భారీ ఖర్చు సినిమా నిండా కనపడతాయి. అయితే, ఈమధ్య కాలంలో తన సినిమాలను (అర్జున్, సైనికుడు, వరుడు) ఆ భారీతనం ఏమాత్రం కాపాడలేకపోయిన విషయాన్ని గుణశేకర్ గ్రహించాడేమో... తాజాగా రూపొందిస్తున్న 'నిప్పు' సినిమాలో ఆ భారీతనానికి, భారీ సెట్స్ కు, గ్రాఫిక్స్ కు స్థానం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖరే స్వయంగా ఈరోజు 'నిప్పు' సినిమా ప్రారంభోత్సవంలో చెప్పి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు!
రవితేజ హీరోగా బొమ్మరిల్లు బ్యానర్ పై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంషూటింగ్ ఈరోజు ఉదయం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తదనంతో అతని పాత్ర సాగుతుందని ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి ఆకుల శివ సంభాషణలు రాస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదట. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము అంటూ త్వరలోనే మిగిలిన వివరాలను తెలియజేస్తానని నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు.


Click it and Unblock the Notifications











