‘అరవింద సమేత’ డిబేట్లో పాల్గొనేందుకు వస్తుండగా ప్రమాదం, రాయలసీమ విద్యార్థి నేత మృతి!
Recommended Video

'అరవింద సమేత' చిత్రంలోని డైలాగులు, సన్నివేశాలు అభ్యంతరకంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ ప్రజా, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు తమ గళం వినిపించారు.
ఈ ప్రెస్‌మీట్లో పాల్గొన్న రాయలసీమ విద్యార్థి నేత, రాయలసీమ యూత్ ఫ్రంట్ అధ్యక్షుడు జలం శ్రీనివాస్(32) రోడ్డు ప్రమాదంలో మరణించారు. 'అరవింద సమేత' వివాదంపై ఓ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న డిబేట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అడ్డాకుల టోల్ ప్లాజా
‘అరవింద సమేత' సినిమాలోని సీన్లను వ్యతిరేకిస్తున్న విద్యార్థి నేతలంతా బొలెరో వాహనంలో మంగళవారం కర్నూలు నుండి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జలం శ్రీనివాస్ మరణించగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.

సెల్ఫీ వీడియో తీస్తుండగానే
ప్రమాదం జరుగడానికి కొన్ని సెకన్ల ముందు వాహనంలో సీమ కృష్ణ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీస్తున్నారు. సెల్ఫీ వీడియో తీస్తుండగానే ముందు వెళుతున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ప్రమాదానికి కారణం సెల్పీ వీడియో వైపు డ్రైవర్ దృష్టి మరల్చడమే అని తెలుస్తోంది.

వర్షం పడుతుంటే రాయలసీమ, తెలంగాణ ప్రస్తావన
వారు సెల్ఫీ వీడియో తీస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటరయ్యారు, భారీగా వర్షం పడుతోంది. ఈ విధంగా రాలయసీమలో పడితే వేసిన శనక్కాయన్న పండుతాది. తెలంగాణలో వర్షం బ్రహ్మాండంగా పడుతోంది. మా ప్రాంతంలో కూడా ఇలా పడాలి అని సీమ కృష్ణ సెల్పీ వీడియోలో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

రాయలసీమలో విషాద ఛాయలు
జలం శ్రీనివాస్ మరణంతో రాయలసీమ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ ప్రాంతం గురించి, తమ ప్రజల గురించి, వారి అభివృద్ధి గురించి పోరాడుతున్న యువత నేత మరణించడం అందరినీ కలిచి వేసింది.


Click it and Unblock the Notifications











