అభిమానులకు సూపర్ స్టార్ చివరి సందేశం
ముంబై : బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఈ నెల 18న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన అభిమానులను మాత్రం మరవలేదు. తన చివరి సందేశంలో అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. రాజేశ్ ఖన్నా మరణించడానికి కొద్ది రోజుల ముందు కుటుంబసభ్యులు, అభిమానులకు ఉద్దేశించి.. తన సినీ కెరీర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక సందేశాన్ని రికార్డు చేశారు. దానిని గత శనివారం ఆయన కుటుంబసభ్యులు బయటపెట్టారు.
అందులో.. "ప్రియమైన మిత్రులారా.. సోదరీ సోదరులారా.. జరిగిపోయినదాని గురించి బాధపడటం, జరుగుతున్నదాని గురించి చింతించడం నాకు అలవాటు లేదు. మనం ఎప్పుడూ భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కానీ, కొన్ని సందర్భాల్లో, కొందరిని కలిసినప్పుడు మాత్రం పాత జ్ఞాపకాలన్నీ తిరిగి కళ్ల ముందు కదలాడుతాయి'' అని రాజేశ్ ఖన్నా ఆ సందేశంలో పేర్కొన్నారు. బాలీవుడ్‌లోకి తాను ప్రవేశించిన విధానాన్ని, తన కెరీర్ గమనాన్ని ఆయన ఆ సందేశంలో వర్ణించారు.
కాగా...రాజేష్ ఖన్నా చితా భస్మాన్ని నిన్న పవిత్ర గంగా నదిలో కలిపారు. ఉత్తరాఖండ్ లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమ జరిగింది. రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, కుమార్తెలు రింకీ ముంబై నుంచి తీసుకొచ్చిన చితా భస్మాన్ని శాస్త్రోక్తంగా గంగలో కలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.


Click it and Unblock the Notifications












