తెలుగు సినిమా ఇంతేనా??
జాతీయ ఉత్తమ నటుడిగా పొరుగు రాష్ట్రాల్లోని హీరోలు పురస్కారాలు అందుకుంటూ మన హీరోల అభిమానులు 'మనకెప్పుడో ఈ ఆనందం?" అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. ఉత్తమ నటుల మాట అలా వుంచి కనీసం ఉత్తమ చిత్రం అవార్డులని కూడా గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కమర్షియల్ ఛట్రంలో ఇరుక్కుపోయి నటులంతా తమ చుట్టూ ఒక గీత గీసుకొని గిరగిరాలు తిరుగుతుంటే........కనీసం అవార్డుల కోసం ప్రయత్నం చేద్దామని దర్శకులు సైతం ఆరాట పడడం లేదు. నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో అన్ని భాషల నుంచి పోటీ పడ్డట్టే మన సినిమాలు కూడా బరిలో నిలిచాయి.
అయితే వాటిలో ఒక్క దానికి కూడా ఒక్క కేటగిరిలోను అవార్డు దక్కలేదు. హ్యాపిడేస్, చందమామ, మీ శేయోభిలాషి చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీ పడగా వీటిలో దేనికీ అవార్డు గెలిచే సత్తా లేదని అవార్డు కమిటీ తేల్చి చెప్పింది. నిజమే...కేవలం 'మీ శ్రేయోభిలాషి" మాత్రమే అంతో ఇంతో ప్రయోజనం ఉన్న సినిమా గానీ, మిగిలిన రెండూ వాణిజ్య విలువలు మినహా మరేమీ లేని సినిమాలే కదా? అవార్డులు గెలవడం మాటలా వుంచి కనీసం అవార్డు కోసం పోటి పడడానికి సైతం అర్హత లేని సినిమాలు వస్తోన్న ప్రస్తుత తరుణంలో మన హీరోలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకోవాలంటే....పరభాషా చిత్రాల్లో నటించాల్సిందేనేమో.


Click it and Unblock the Notifications











