తమిళనాడులో ‘రెబల్’ రికార్డ్ రిలీజ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం తమిళనాడులో రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తమిళనాడు రైట్స్ రూ. 33 లక్షలకు కొనుగోలు చేసిన పివిపి సినిమా సంస్థ అక్కడ 'రెబల్' చిత్రాన్ని రికార్డు స్థాయిలో 41 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన 'తాండవం' చిత్రం అక్టోబర్ 5కు వాయిదా పడటంతో 'రెబల్' చిత్రానికి మరిన్ని థియేటర్లు దొరికినట్లయింది. లారెన్స్ దర్శకత్వం కావడం, ప్రభాస్ సినిమాలకు కూడా తమిళనాట ఆశాజనకమైన అవకాశాలు ఉండటంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయని ఆశిస్తున్నారు.
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ యాక్షన్, తమన్నా, దీక్షా సేథ్ గ్లామర్ అభిమానులను మజా చేయనున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ హైటెక్నికల్ విలువలతో స్టయిలిష్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపనున్నామని తెలిపారు.
మరో వైపు ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి 'వారధి' అనే పేరు పరిశీలనలో ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











