లెస్బియన్‌గా అనేక సందేహాలు.. అలా సమాజ కట్టుబాట్లను ఎదురించా.. రెజీనా
ఇప్పటి వరకు దక్షిణాదిలో సత్తా చాటిన రెజీనా కసాండ్రా గతేడాది బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్‌లో వచ్చిన ఏక్ లడ్కీ ఖో దేఖాతో ఐసా లగా అనే సినిమా ద్వారా హిందీ చిత్రరంగంలోకి ప్రవేశించింది. ఆ చిత్రంలో సోనమ్ కపూర్‌తో కలిసి రెజీనా లెస్బియన్‌గా నటించింది. అలా నటించడంపై రకరకాల కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఎవరు అనే తెలుగు సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెజీనా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. తన బాలీవుడ్ సినిమా గురించి, ఆ సినిమా ఆఫర్ ఎలా వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. రెజీనా చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

బాలీవుడ్ మూవీ ఆఫర్
బాలీవుడ్‌లో ఏక్ లడ్కీతో దేఖాతో ఐసా లగా సినిమా ఆఫర్ తొలుత నన్ను సందిగ్ధంలో పడేసింది. దర్శకుడు షెల్లీ ఓ రోజు ఫోన్ చేసి, విధు వినోద్ ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పాడు. మేము ఈ రకమైన కథతో సినిమా చేస్తున్నాం. మీరు చేస్తారా? అని చెప్పినప్పుడు హిందీలో నా తొలి సినిమాలో ఇలాంటి సినిమా చేయవచ్చా? అనే సందేహం వెంటాడింది.

డైరెక్టర్ షెల్లీ కథ చెప్పగానే
దర్శకుడు షెల్లీ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నా క్యారెక్టర్ బోల్డ్ కావడంతో చాలా మందిని ఇలాంటి సినిమాను చేయవచ్చా అని ఫీడ్‌బ్యాక్ తీసుకొన్నాను. ఆ తర్వాత చాలా మందితో మాట్లాడిన తర్వాత నీవు ఇలాంటి సినిమాలు చేయవద్దనే చెప్పారు. కానీ ఇలాంటి సినిమాలు రావడం అరుదుగా వస్తుంటాయని, ఏది ఏమైనా ఆ పాత్రను చేయాలని అనుకొన్నాను. ఆ రకంగా నా బాలీవుడ్ ఎంట్రీ జరిగింది.

బోల్డ్, వల్గారిటీ అంటే
నాకు విభిన్న పాత్రలను, చాలెంజిగ్‌గా ఉండే పాత్రలను చేయడం నాకు ఇష్టం. అ!, ఏకో లడ్కీ ఖో దేఖాతో ఐసా లగా సినిమాలో పాత్రలు రోటీన్‌కు భిన్నం. బోల్డ్ అనే పదానికి వల్గారిటీకి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఏ పాత్ర అయినా శృతిమించితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా నేను జాగ్రత్తలు పడుతుంటాను.

లెస్బియన్‌గా నటించడంపై
నా గత చిత్రాల్లో సామాజిక కట్టుబాట్లను ఎదురించే పాత్రలు చేశాను. లెస్బియన్ (స్వలింగ్ సంపర్కురాలిగా) చేయడం దేశంలోని అనేక సామాజిక కట్టుబాట్లను ఎదురించడమే. చాలా మంది నేను పోషించిన లెస్పియన్ రోల్‌లో తమ పాత్రలను చూసుకొన్నారు. ఆ పాత్రను కూడా సోనమ్ కపూర్ అద్భుతంగా పోషించింది. అందుకే ఆ సినిమా అంతగా వివాదంగా మారలేదు అని రెజీనా చెప్పారు.

అన్నివర్గాల నుంచి ప్రశంసలు
ఏక్ లడ్కీ ఖో దేఖా తో ఐసా లగా సినిమాలో నేను పోషించిన పాత్రకు ఎల్జీబీటీక్యూ సమాజం నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఛాలెంజ్‌గా నిలచే పాత్రలో నటించినందుకు నా సన్నిహితులు కాల్ చేసి మెచ్చుకొన్నారు. కమర్షియల్ హీరోయిన్ అయితే ఇలాంటి పాత్రలు చేయడం సాధ్యపడేవి కాదని చెప్పారు. సమాజంలో ఓ వర్గం నుంచి కూడా నా పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది అని రెజీనా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











