ఎన్నికల్లో ఓడితే మళ్లీ వృత్తిలోకే.... : హీరోయిన్ రమ్య
బెంగుళూరు: కన్నడ హీరోయిన్ రమ్య గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కర్ణాటకలోని పాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆమె మరోసారి బరిలోకి దిగి అదే స్థానం నుండి పోటీ చేసారు. ఈ రోజు సాయంత్రానికల్లా రమ్య రాజకీయ భవితవ్యం తేలనుంది.
కాగా....ఈ సారి రమ్య ఓటమి తప్పదనే విశ్లేషణలు వెలువడటం, బయట కూడా ఇదే రకమైన ప్రచారం జోరందుకోవడంతో నటి రమ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. జీవితంలో గెలుపోటములు అనేవి సహజం, ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను. నాకు ఒకసారి ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. మళ్లీ గెలిస్తే కుటుంబం లాంటి మాండ్యా ప్రాంతానికి సేవ చేస్తూ గడుపుతాను. ఓడితే సినిమాల్లో కొనసాగుతాను అని రమ్య తెలిపారు.

కన్నడలో పాపులర్ హీరోయన్ అయిన రమ్య 2011లో కాంగ్రెస్ పార్టీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కర్నాటకలోని మాండ్యా పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. 2013 ఆగస్టున ఆమె 47, 622 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
దేశంలోనే యంగెస్ట్ ఫిమేల్ ఎంపీగా రమ్య వార్తల్లోకి ఎక్కారు. ఆమె సినిమా కెరీర్ విషయానికొస్తే 2003లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె కన్నడలో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో అభిమన్యు, అమృత వర్షం చిత్రాల్లోనటించింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











