రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష...హీరో టెన్షన్
ముంబయి: సల్మాన్‌ఖాన్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో పదకొండేళ్ల తర్వాత పునర్విచారణ ప్రారంభమయింది. ఈ కేసులో ఒక సాక్షి అయిన సాంబ గౌడ.. సోమవారం.. సెషన్స్ న్యాయస్థానం ముందు సాక్ష్యం చెప్పారు. 2002, సెప్టెంబరు 28న బాంద్రా శివారుల్లో ఓ బేకరీ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్ నడుపుతున్న కారు దూసుకుపోవడంతో ఒకరు మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాక్షులను విచారించలేదన్న కారణంతో.. తాజాగా మళ్లీ విచారణ చేపట్టాలంటూ గత ఏడాది డిసెంబరు 5న న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ అన్న అభియోగంపై విచారణ జరిగింది. అది రుజువయితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ తాజాగా ఆ అభియోగంపై కాకుండా మరణానికి కారణమైన కేసు (కల్పబుల్ హోమిసైడ్)అనే అభియోగం మోపారు. ఇది రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఆ ప్రమాదానికి కారణమైన కారు పెద్ద కారు అని, ప్రమాద స్థలి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు తాలూకూ వస్తువులను తాను గుర్తుపట్టగలనని సాంబ గౌడ.. ప్రాసిక్యూటర్‌కు చెప్పారు. కారు నంబరు ప్లేటును, బంపర్ భాగాలను, అద్దం ముక్కలను తాను చూశానని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రత్యక్ష సాక్షులను మే 6న ప్రాసిక్యూషన్ విచారిస్తుందని, ఆరోజు హాజరు కావాలని సల్మాన్‌ఖాన్‌ను కోర్టు సోమవారం ఆదేశించింది.
ప్రమాదం జరిగిన రోజున ఆ కారును నడిపింది సల్మాన్‌ఖానో కాదో గుర్తించాలని ప్రత్యక్షసాక్షులను కోర్టులో అడిగే అవకాశం ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను గుర్తించడానికి సాంబగౌడను మే 2న హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.


Click it and Unblock the Notifications











