జై చంద్రబాబు.. ఆసక్తి రేపుతున్న ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్వీట్
వివాదాలకు, వివాదాస్పద చిత్రాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ త్వరలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని, దీన్ని ఆపివేయాలంటూ టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అంతే కాదు... జై చంద్రబాబు అంటూ తన ట్వీట్లో పేర్కొనడం చర్చనీయాంశం అయింది.
100 శాతం కాన్ఫిడెన్సుతో ఉన్నాం, జై చంద్రబాబు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా 29న విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా విడుదలపై 100 శాతం కాన్ఫిడెన్సుతో ఉన్నాం. ఎందుకంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా సినిమా విషయంలో తన ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, విడుదల అడ్డుకోవడానికి రౌడీ ఎలిమెంట్స్ వాడకుండా నిరోధిస్తారని నమ్మకం ఉంది. జై చంద్రబాబు, జై ఎన్టీఆర్... అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

వర్మ వరుస ఇంటర్వ్యూలు
ఈ చిత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని, ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని, అందుకే అడ్డుకునే ప్రచయ్నం జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ... రామ్ గోపాల్ వర్మ ఈ అంశంపై చర్చించేందుకు మీడియా ఛానల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

వెన్నుపోటు పర్వం ప్రధానంగా...
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ... రామారావు కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణమాలు ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పర్వాన్ని హైలెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఉండబోతోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











