ఆ దర్శకుడిపై కేసుపెట్టాలి: రామ్ గోపాల్ వర్మ
దర్శకుడి మీద నమ్మకంతో నిర్మాత సినిమా తీస్తాడు. కానీ ప్రస్తుతం నిర్మాతకు అవగాహన లేకపోవడమో, దర్శకుడికి స్క్రిప్టుపై పట్టులేకపోవడమో నిర్మాణ వ్యయం హద్దులు దాటేస్తుంది. ముందు చెప్పేది ఒకటి.. తెరపై చూపించేది ఇంకోటి అవుతోంది. అలాంటప్పుడు చెప్పింది తీయని దర్శకుడిపై కేసుపెట్టాలి. మన నిబంధనలు అలా మారాలి అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన్ని దర్శకుడికీ నిర్మాతకీ మధ్య ఎలాంటి సంబంధం ఉండాలంటారు అని మీడియావారు అడిగితే ఇలా స్పందించారు. త్వరలో విడుదలకానున్న బెజవాడ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. అలాగే... తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉండాల్సిన అవసరం తనకు లేదని కూడా వర్మ తేల్చి చెప్పారు. ఆయన మాటల్లోనే.. నేను మంచి సినిమా తీశాను కాబట్టే చూశారు. నన్ను ప్రోత్సహించాలనో, నా జీవితాన్ని ఉద్ధరించాలనో ప్రేక్షకులు సినిమా చూశారనడం వట్టి మాట. ప్లాఫ్ అయిన సినిమాలు చూడలేదు కదా! అప్పుడు కూడా నా సినిమాలని ఆదరించి ఉంటే రుణపడి ఉండేవాడినేమో అన్నారు.
ఇక తన చిత్రం బెజవాడ గురించి చెపుతూ.. ఇదేదో బెజవాడ రాజకీయాలు, హత్యల చుట్టూ తిరిగే కథ అనుకుంటున్నారు. అలా అనిపిస్తుంది తప్పితే ఈ కథకీ బెజవాడలో జరిగిన వాస్తవ సంఘటనలకూ ఏ సంబంధం లేదు. ఇందులో రౌడీయిజం, గుండాయిజం మాత్రం ఉంటాయి. ఇక నాగచైతన్య ప్రేమకథలకు మాత్రమే సరిపోతాడనుకుంటే పొరపాటే. ఒక్కోసారి ప్రేమ కథలు కూడా పరాజయం కావచ్చు. ఏదైనా దర్శకుడు కథను తెరకెక్కించే విధానంలోనే ఉంటుంది. నాగచైతన్య నటన తప్పకుండా కొత్త పంథాలో ఉంటుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆయన హిందీలో 'డిపార్ట్‌మెంట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











