ఒసామా బిన్ లాడెన్ దయ్యం, వర్మ కొత్త ఆలోచన!
హైదరాబాద్: దెయ్యం సినిమాలకు రామ్ గోపాల్ వర్మ ఫేమస్ అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఆయన దర్శకత్వంలో అనేక దయ్యం సినిమాలు వచ్చాయి. తాజాగా వర్మకు సరికొత్త ఆలోచన వచ్చింది. అమెరికా సైన్యం చేతిలో హతమైన ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ దయ్యమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో హాలీవుడ్ హారర్ సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు.
వర్మ నుండి మరో దయ్యం సినిమా రాబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీం' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. టైటిల్ చూసి ఇదేదో వర్మ రొటీన్‌గా తీసే సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత వర్మ మరోసారి ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా భయపెడతాడని స్పష్టం అవుతోంది.

'ఐస్ క్రీమ్' చిత్రాన్ని భీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత 2 నెలలుగా ఏకబిగిన జరిగిన షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు.
చాలా మందికి అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. దానికి కారణం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించక పోవడమే. అసలు ఇలాంటి చేయడం వర్మకు ఇష్టం ఉండదట. సినిమా మొత్తం పూర్తయి..ఒక ట్రైలర్ గానీ, లేదా టీజర్ గానీ చేతికి వచ్చాకే సదరు సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేస్తాడు. ఆ కోవలోనే 'ఐస్ క్రీమ్' టీజర్ రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. 'ఐస్ క్రీమ్' టైటిల్ చూస్తేనే ఈ చిత్రం వర్మ గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
తన మొదటి చిత్రం 'శివ'తో 'స్టడీకామ్' అనే పరికరాన్ని పరిశ్రమకు పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ....'ఐస్ క్రీమ్' చిత్రంతో 'ఫ్లోకామ్' అనే ఒక సరికొత్త పరికరాన్ని చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ 'ఫ్లోకామ్' అనే టెక్నికల్ పరికరాన్ని మొత్తం ఆసియాలోనే మొట్ట మొదటి సారిగా 'ఐస్ క్రీమ్' చిత్రం కోసం ఉపయోగించడం విశేషం.


Click it and Unblock the Notifications











