"గెలిస్తే సీఎం..లేకుంటే మొగుడు- వెన్నుపోటుకు ప్రతీకారంగా పవన్ కళ్యాణ్ ముందుపోటు"
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాను వేడెక్కించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రమోట్ చేయడానికి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను వాడుకుంటున్న ఆయన... తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన కథను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ద్వారా చెప్పబోతున్న వర్మ... వెన్నుపోటు పర్వాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు. రామారావుపై కుటుంబ సభ్యులే కుట్ర చేశారనే పాయింటును తెరపైకి తెచ్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు.
మెగా నమ్మకం
‘సీ.బీ.ఎన్ , పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబును ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం.' అంటూ వర్మ ట్వీట్ చేశారు.
గెలిస్తే సీఎం, లేకుంటే మొగుడు
‘పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు. గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడు అవుతాడు' అని తనకు బ్రహ్మాంగారు నాకు చెవిలో చెప్పినట్లు వర్మ ట్వీట్ చేశారు.
అబద్దపు కథలు కాదు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించేది అబద్దపు కథలు కాదు, మహా గొప్పలు అంతకన్నా కాదు. సినిమాలో కేవలం జరిగిన నిజాలనే చూపించబోతున్నాం... అందుకే మా సినిమాకు సంబంధించిన సాంగ్, టీజర్ రిలీజైనా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని వర్మ తెలిపారు.

ఆర్జీవీ వర్సెస్ పవన్ కళ్యాణ్.. వేడి తగ్గిందా?
ఆ మధ్య శ్రీరెడ్డి ఇష్యూ సమయంలో రామ్ గోపాల్ వర్మ మెగా అభిమానులకు టార్గెట్ అయ్యారు. ఆ సమయంలో శ్రీరెడ్డిని ఉపయోగించుకుని కావాలనే పవన్ కళ్యాణ్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. అయితే ఇపుడు వర్మ చేస్తున్న ట్వీట్స్ పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా ఉండటంతో .... ‘ఆర్జీవీ వర్సెస్ పవన్ కళ్యాణ్' వివాదం వేడి తగ్గినట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











