శ్రీదేవి కోసం లైన్లో నిలబడతా: రామ్‌గోపాల్‌వర్మ
ముంబై : "శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నాను..ఆగలేకపోతున్నాను. నేను డైరక్టర్ అయిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మొదటి సారిగా శ్రీధేవి కోసం లైన్లో నిలబడి టిక్కెట్ కొనుక్కుంటాను," అంటూ యాభై సంవత్సరాల రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేసి అందరిలో ఆసక్తిని రేపారు. ఆమెపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటారు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తన అభిమాన హీరోయిన్ నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రాన్ని చూడాలని రామ్‌గోపాల్‌వర్మ అనుకుంటున్నానని అన్నారు.
జగదేక సుందరి శ్రీదేవి దాదాపు పద్నాలుగేళ్ల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం 'ఇంగ్లీష్-వింగ్లీష్'. తనలోని భావాలు వివరించడానికి తగ్గ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేక భర్త విషయంలోనూ, సమాజంలో ఎదురయ్యే వ్యక్తులతోను ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ ఈ లోపాన్ని సవరించుకోడానికి 'ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్'లో చేరి విశేషంగా కృషి చేసి, ఇంగ్లీషులో పాండిత్యం సంపాదించి ఎదుటివాళ్లను అవాక్కయ్యేలా చేసే 'శశి' పాత్రను శ్రీదేవి పోషించింది. హిందీ వెర్షన్లో అమితాబ్ బచ్చన్ ఓ ప్రత్యేక పాత్రను పోషించగా, తమిళ వెర్షన్‌కు అజిత్ ఓ ప్రత్యేక పాత్రను పోషించారు.
''ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం లేని తొలిదశలో నేను పడిన ఇబ్బందులు, సిగ్గుపడిన విధానం, బాధపడిన అంశాలు గుర్తు కొచ్చాయి ఈ చిత్రంలోని నా పాత్ర గురించి వినగానే. అందుకే ఆ పాత్రలో మమేకం అయ్యాను'' అన్నారు శ్రీదేవి. ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గౌరి షిండే దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ద్విభాషా చిత్రంగా హిందీ తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇంగ్లీష్ తెలియని ఓ పల్లెటూరి యువతి ఆ భాషను ఏవిధంగా నేర్చుకుంది? ఆ తర్వాత అందరికి ఏలా ఆదర్శంగా నిలిచిందన్నదే ఈ చిత్ర కథ. పల్లెటూరి యువతిగా శ్రీదేవి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె నటనే ప్రధానాకర్షణగా తెరకెక్కిన ఈ చిత్రంలో అందరికి కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో వున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అక్టోబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. చాలా కాలం తర్వాత శ్రీదేవి నటించిన ఈ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు గర్వంగా వుంది' అన్నారు.
సంగీతం అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం లక్ష్మణ్ ఉతేకర్, కూర్పు హేమంతి సర్కార్ నిర్వహించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం గౌరి షిండే. హోప్ ప్రొడక్షన్స్ పతాకాన సునీల్ లుల్లా, ఆర్ బాల్కి, రాకేష్ ఝుంఝన్ వాలా, ఆర్.కె. దామిని నిర్మించారు.


Click it and Unblock the Notifications











