సీన్ లో రాంగోపాల్‌వర్మ ఉన్నాడు కాబట్టే రచ్చ
హైదరాబాద్ : ఒక్కోసారి అసలు కన్నా కొసరే మీడియాను ఆకర్షిస్తూంటుంది. వార్త హైలెట్ అవ్వటానికి సీన్ లో వర్మ లాంటి వివాదాల దర్శకుడు ఉంటే చాలు. ఆ వార్త వేడెక్కుతుంది. ఇప్పుడు అదే జరిగింది. తెలుగు సినీ రచయిత,దర్శకుడు బీవీఎస్ రవి మద్యం తాగి వాహనం నడుపుతూ రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అతనితోపాటు ప్రముఖ దర్శకులు రాంగోపాల్‌వర్మ కూడా అదే కారులో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఆ సీన్ లో లేకపోతే అంత పబ్లిసీటి జరిగేది కాదని సినీ వర్గాలు అంటున్నాయి.
రవి ఇలా పోలీసులకు పట్టుబడడం ఇది రెండోసారని, డ్రింక్ డ్రైవ్ కేసుకి ఇంతలా మీడియా మొత్తం ఈ రీతిలో ఫోకస్ పెట్టటానికి కారణం వర్మ ప్రక్కనే ఉండటమే అని చెప్పుకుంటున్నారు. రవి పట్టుబడటం అనదాని కన్నా... వర్మ ఇలా అక్కడ కనపడటం మీడియాకు వార్తయ్యి కూర్చుని రచ్చ రచ్చ అయ్యి కూర్చుంది. లేకపోతే అదో క్యాజువల్ న్యూస్ అయ్యి ఉండేది. మీడియా ఖచ్చితంగా దానికి అంత ప్రయారిటీ ఇచ్చి ఉండేది కాదు.

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటగిరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సినీ రచయిత రవి, దర్శకుడు రాంగోపాల్‌వర్మ జూబ్లీహిల్స్ నుంచి యూసుఫ్‌గూడ వైపు కారులో వస్తున్నారు.
వాహనం నడుపుతున్న రవిని శ్వాస విశ్లేషణ పరికరం (బ్రీత్ ఎనలైజర్)తో పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధరణ అయింది. పోలీసులు రవి కారును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా మొత్తం 14 కార్లు, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.


Click it and Unblock the Notifications











