నన్ను బెదిరిస్తున్నారు: రామ్ గోపాల్ వర్మ
'బెజవాడ" సినిమా ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ.... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. బుధవారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ కొందరు తన బెజవాడ సినిమాపై అనవసర అపోహలు పెట్టుకున్నారని, ఆ సినిమా కథ కేవలం కల్పితం మాత్రమే అని స్పష్టం చేశారు. బెజ బెజ బెజవాడ పాటలోని పదాలను విడదీసి దానికి కులం రంగు అంటగడ్డం సరికాదని, సినిమాను వినోదాత్మక కోణంలో చూడాలని సూచించారు.
అయితే...రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై మరో వాదన కూడా వినిపిస్తోంది. వర్మ కావాలని తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని అబద్దం చెబుతున్నాడని, తన సినిమాను పబ్లిసిటీ చేసుకోవడానికి వర్మ వేసిన ఎత్తుగడే ఈ బెదిరింపు కాల్స్ నాటకమని మరికొందరు వాదిస్తున్నారు. రక్త చరిత్ర సినిమా విడుదల సమయంలోనూ వర్మ ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
నాగచైతన్య, అమలపాల్ జంటగా బెజవాడ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వర్మ శిష్యుడు వివేక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కోనేరు జంటగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4 ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











