అలా అంటే ఎన్టీఆర్‌ను అవమానించినట్టే.. కళ్లు బైర్లు కమ్మే నిజాలు.. వర్మ ఓపెన్ ఛాలెంజ్!
నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నట్లు చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఇక్కడి శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి'స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు వర్మ ఓ వీడియో విడుదల చేశారు.
ఈ ప్రెస్ మీట్ ఉద్దేశ్యం ఏమిటి? సినిమాలో ఏం చూపించబోతున్నాం? లక్ష్మీ పార్వతి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటనే వివరాలు వివరిస్తూ.... కళ్ల బైర్లు కమ్మే వాస్తవాలతో బయట పెట్టబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు తీస్తున్న ఇతరకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

అందుకే ఈ సినిమా తీస్తున్నా
ఎన్టీ రామారావుగారి నిజమైన అభిమానులకు నా బహిరంగ ప్రకటన. సినిమా అనేదానికి సరైన నిర్వచనం జీవితానికి అద్దం పట్టడం. జీవితానికి అర్థం నిజంగా జీవించడం. అసలు నిజానికి నిజంగా జీవించే వారికి మరణం ఉండదు. ఎందుకంటే అలాంటివారు భౌతికంగా మరణించినా వారు ప్రేమించే మనుషుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఎన్టీఆర్ గారి మీద ఈ సినిమా తీయడానికి ముఖ్యకారణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాలు ఉండటమే.

దీన్ని కేవలం సినిమా అంటే సినీ మహాతల్లిని, ఎన్టీఆర్‌ను అవమానించినట్లే
ఎన్టీ రామారావు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలు. అందుకనే ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని కేవలం ఒక సినిమా అనడం సినీ మహాతల్లిని, ఎన్టీఆర్ గారిని కూడా అవమానించినట్లే.

చెరపలేని రౌద్ర ముద్ర
ఎందుకంటే ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపడానికి చచ్చేంత ప్రయత్నం చేసినా చెరపలేకుండా చేయడానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన రౌద్ర ముద్ర.

లక్ష్మి పార్వతిని అవమానిస్తే...
లక్ష్మీ పార్వతిగారి గురించి నాకు వేర్వేరు మంది వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు ఉదంతాలు చెప్పారు. వారు తెలిసి చెప్పారో? తెలియక చెప్పారో? ఏదైనా ఎజెండాతో చెప్పారో? రకరకాల కారణాలు ఉండొచ్చు. వాదించడానికి వీలులేని ఒక పూర్తి నగ్నసత్యం ఏమిటంటే... ఎన్టీఆర్ గారు ఆయన పోయే కొన్ని రోజులు ముందే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడారు. అందుచేత ఆవిడను అవమానించడం కానీ, అనుమానించడం కానీ చేస్తే సాక్ష్యాత్తు ఎన్టీఆర్ గారిని అనుమానించి అవమానించినట్లే.

కళ్లు బైర్లు కమ్మే నిజాలు లోతుగా తవ్వాను
అలా అని నేను ఎవరో ఒకరి మాటలే వినడం లేదు. లక్ష్మి పార్వతి గారి దగ్గర నుంచి ఆ సమయంలో ఆ ఇంట్లో పని చేసిన పనివాళ్లను, వాళ్ల స్టాఫ్, అప్పటి ఆఫీసర్లను, పార్టీ మెంబర్లను, చివరకు ఆవిడ శత్రువులను కూడా ఇంటర్వ్యూ చేసి కళ్లు బైర్లు కమ్మే నిజాలను లోతుగా తవ్వి బయటకు తీశాను.

ఈ సినిమా ఆవిడ గురించి కాదు
లక్ష్మిగారిని ఈవెంటుకు గెస్టుగా పిలిచాము కనుక కేవలం ఆవిడ పాయింటాఫ్ వ్యూలోనే సినిమా తీస్తున్నామని అనుకునే వారు అర్థం చేసుకోవాల్సింది... నేను ఈ సినిమా తీస్తుంది ఎన్టీఆర్ గురించి, ఆవిడ గురించి కాదు. ఆయన మీద గౌరవం మూలాన ఆవిడను గౌరవించి ఆయన మీద గౌరవం ఉంచడం నిజమైన అభిమానులకు కనీస బాధ్యత. ఆవిడను పిలిచిన ఒక కారణం ఎన్టీఆర్ గారి భార్యగా ఆయన మీద ఉన్న గౌరవంతో, రెండో కారణం సినిమా టైటిల్ బట్టే అర్థమవుతోంది ఆవిడది చాలా చాలా ముఖ్య పాత్ర.

నా జీవితంలో తొలిసారి
అదేవిధంగా పరమ నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారి వెంకటేశ్వర స్వామి గుడిలో దైవ పూజ చేసి తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఎన్టీఆర్ గారి మీద నాకున్న హిమాలయ పర్వతం అంత గౌరవంతో.

ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే
అయితే ఇపుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉండబోతోంది అన్న ప్రశ్నకు నా సమాధానం కేవలం నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని చెప్పగలను.

జనవరి 24న విడుదల, ఆ ఉద్దేశ్యం లేదని చెప్పినా నమ్మరు
జనవరి 24న విడుదలకాబోయే ఈ సినిమా పట్ల ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెప్పినా నమ్మరు కనుక చెప్పను. కానీ ఉన్నాయని చెప్పి లేనివి కల్పించి నిజమని ఒప్పించబోనని ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మా సినిమాకే ఎన్టీఆర్ ఆశీస్సులు
నా చివరి మాట ఎవరెన్ని నమ్మినా నమ్మక పోయినా ఒక కచ్చితమైన నిజం మాత్రం... ఎవరు ఏ ఎన్టీఆర్ సినిమా చేసినా ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాత్రం కేవలం మా లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉంటాయని గంటా పదంగా గుండెల మీద చెయ్యేసి చెప్పగలను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్.


Click it and Unblock the Notifications











